astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

మొక్క‌లు పెంచ‌టం మంచిది కాదా..!


మొక్క‌లు పెంచ‌టం మంచిది కాద‌ని ఎవ‌రైనా చెబితే దాన్ని న‌మ్మ‌వ‌ద్దు. మొక్క‌ల్ని పెంచ‌టం, చెట్లు పెట్ట‌డం అన్న‌ది హైంద‌వ సంస్కృతిలో ఒక భాగం. దీన్ని అల‌వాటుగా చేసుకొనేందుకు ఒక్కో న‌క్ష‌త్రానికి ఒక్కో మొక్క‌ను సూచించ‌టం జ‌రిగింది. క‌నీసం దీని కార‌ణంగా అయినా ప్ర‌తీ మ‌నిషి ఒక చెట్టును పెంచుతార‌ని భావ‌న‌. అంత అంత‌రార్థంతో చెట్లు పెంచ‌టాన్ని ప్రోత్స‌హించిన సంస్కృతి మ‌న‌ది.

విష్ణుమూర్తి తుల‌సీ ద‌ళం రూపంలో శోభిల్లుతాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి ఈ  మొక్క‌లు ఎంతో ఔష‌ధ గుణాలు క‌ల్గి ఉన్నాయి. అటువంటి విలువైన మొక్క‌ల్ని పెంచ‌టం, ఆయా ఆకుల్ని ఉప‌యోగించ‌టం వ‌ల‌న ఔష‌ధ గుణాలు ల‌భిస్తాయి. అందుచేత ఇటువంటి మొక్క‌లు, ప‌త్రాల వినియోగాన్ని ప్రోత్స‌హించ‌టం జ‌రిగింది. అదే స‌మ‌యంలో ప‌త్తి  వంటి మొక్క‌ల్ని పెంచ‌టం మంచిది కాదంటారు. దీనికి కార‌ణం ఏమిటంటే ప‌త్తి నుంచి వ‌చ్చే దూది ఎగిరి క‌ళ్ల‌కు ఇబ్బంది క‌ల్గిస్తుంది కాబ‌ట్టి ఆ ర‌కంగా చెబుతారు త‌ప్పితే మొక్క‌ల పెంచ‌టం స‌రైన చ‌ర్యే అని గుర్తుంచుకోవాలి.

ప‌ని మొద‌లు పెట్టేట‌ప్పుడు గ‌మ‌నించాల్సిన‌వి..!


ఏ పూజ చేసినా మొద‌ట‌గా కొల‌వాల్సింది గ‌ణ‌ప‌తినే. అటువంటి గ‌ణ‌ప‌తి పూజ‌లో శ్ర‌ద్ద ముఖ్యం. గ‌ణ‌ప‌తి కి ప‌త్రి అంటే చాలా ఇష్టం. అందుకే సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌త్రి తో పూజించ‌టం మేలు. అందునా గ‌రిక అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. అందుచేత గ‌రిక తో పూజించేందుకు ప్ర‌య‌త్నించాలి. 21 సార్లు గ‌రిక‌తో పూజిస్తే గ‌ణ నాధుడు ఎంతో సంతోషిస్తాడు. క‌నీసం 5 సార్లు అయినా పూజిస్తే మేలు. లేదంటే అక్షిత‌ల‌తో పూజించుకోవ‌చ్చు. అయితే అక్షిత‌లు క‌ల‌ప‌టంలో ప‌సుపు ను నీటితో క‌న్నా ఆవునేతితో క‌లిపితే మంచిద‌న్న మాట ఉంది. ఏమైనా షోడ‌శ ఉప‌చారాల‌తో గ‌ణ నాధుడ్ని పూజించి ఆ త‌ర్వాత ఏ కార్య‌క్ర‌మ‌మైనా సంక‌ల్పిస్తే శుభం క‌లుగుతుంది.

పసుపు తో వినాయ‌కుడి ప్రాధాన్యం ఏమిటి..!

ప‌సుపు తో వినాయ‌కుడ్ని త‌యారుచేసుకొని పూజ చేసుకొంటుంటాం. కేవ‌లం వినాయ‌కుడ్నే ఈ రూపంలో పూజ చేసుకొంటాం. ప్ర‌తీ పూజ‌కు, శుభ కార్యాల‌కు ముందు గ‌ణ‌పతి పూజ త‌ప్ప‌నిస‌రి. ఆఖ‌రికి వినాయ‌క వ్ర‌తం చేసే ముందు కూడా ప‌సుపుతో చేసిన గ‌ణ‌ప‌తికి అర్చించుకొంటాం. విఘ్నాలు ఏర్ప‌డ‌కుండా ఉండాల‌ని, త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుకొంటూ ఈ ప‌సుపు వినాయ‌కుడ్ని అర్చించుకోవ‌టం ఆన‌వాయితీ.

వాస్త‌వానికి ప‌సుపు తో వినాయ‌కుడ్ని చేయ‌టంపై భిన్న క‌థ‌నాలు ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది త్రిపురాసుర సంహారానికి సంబంధించిన‌ది. ఆ స‌మ‌యంలో నందీశ్వ‌రుడి మూడో కొమ్ము అయిన పసుపు కొమ్ము ప‌డిపోయిన‌ది. అది ఎక్క‌డ‌కు పోయిందో అని ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో దీన్ని ... సూక్ష్మ బుద్ది గ‌లిగిన వినాయ‌కుడు వెద‌కి తెచ్చిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత వినాయ‌కుడిని ప‌సుపు ముద్ద రూపంలో పూజిస్తే ఎటువంటి కార్య‌మైనా నెర‌వేరుతుంద‌ని వ‌రం ఇచ్చిన‌ట్లు చెబుతారు. అప్ప‌టినుంచి వినాయ‌కుడ్ని పసుపు ముద్ద రూపంలో అర్చించ‌టం ఆన‌వాయితీ గా వ‌స్తోంది. అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడ్ని పూజిస్తే స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.

అంద‌రికీ తెలిసిందే అయిన‌ప్ప‌టికీ ... ఒక కొత్త విష‌యం తెలుసుకొందాం..!


తెలిసిన విష‌యాలు చాలా ఉంటాయి కానీ అందులోని అంత‌రార్థం తెలుసుకొంటే మాత్రం వివ‌ర‌ణ పూర్తిగా తెలుస్తుంది.

నుదుట‌న కుంకుమ బొట్టు పెట్టుకొంటాం మ‌న సాంప్ర‌దాయం. దీనికి బ‌దులు ఇప్పుడు స్టిక్క‌ర్ లు పెట్టుకోవ‌టం అలవాటైంది. దీని మీద వ్యాఖ్యానించ‌ద‌ల‌చుకోలేదు. కానీ నుదుట‌న కుంకుమ పెట్టుకోవ‌టం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. నుదిటి ప్రాంతంలో నాడీ వ్య‌వ‌స్థ కు చెందిన కీల‌క నాడుల‌న్నీ ఒకే చోట పోగు ప‌డి ఉంటాయి. ఇక్క‌డ నుంచే మెద‌డుకు వెళ్లే నాడులు సాగుతుంటాయి. ఇక్క‌డ ఉండే ర‌క్త నాళాల్లో చురుగ్గా ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతు ఉంటుంది. ఆ ఉధృతికి త‌గిన‌ట్లుగానే ఇక్క‌డ ఒత్తిడి ఉంటుంది. అందుచేత అక్క‌డ చ‌ల్ల‌ద‌నాన్ని ఇచ్చే విధంగా బొట్టు పెట్టుకొంటే మంచిది. ఇందుకోసం పూర్వ కాలంలో అర‌టి బొట్టు పెట్టుకొనేవారు. అర‌టి బొట్టు అంటే అర‌టి చెట్టు ని కూల్చిన‌ప్పుడు కొంత మేర న‌ల్ల‌గా ఏర్ప‌డుతుంది. ఆ కాండ‌ము ను క‌త్తిరించి ఆర పెట్టిన‌ప్పుడు ఇది ఏర్ప‌డుతుంది. దీన్ని సేక‌రించి బొట్టుగా పెట్టుకొనే సాంప్ర‌దాయం ఉంది. కొన్ని చోట్ల మారేడు ద‌ళాలు ఎండ పెట్టి కాల్చి దీన్ని బొట్టుగా ధ‌రిస్తారు. క‌నీసం ప‌సుపు నుంచి త‌యారు చేసిన కుంకుమ ను బొట్టుగా పెట్టుకొన్నా చాలా మంచిదే. అందుచేత ఏ రూపంలోని బొట్టుని అయినా ధ‌రించ‌టం వ‌ల‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. అంతే కాకుండా ముఖ వ‌ర్చస్సు కూడా నిండుగా ఉంటుంది. ఆడ‌వారు మాత్ర‌మే కాదు మ‌గ వారు కూడా చ‌క్క‌గా బొట్టు పెట్టుకొంటే ఆరోగ్య వంతంగా సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉండ‌టానికి వీల‌వుతుంది. ఆలోచించి చూడండి..!

భాద్ర ప‌ద మాసం లో మ‌రిచిపోకూడ‌ని విష‌యం..!

భాద్ర‌ప‌ద మాసం వేగంగా గ‌డిచిపోతోంది. ఇప్ప‌టికే శుక్ల ప‌క్షం స‌గం రోజులు గ‌డ‌చిపోయాయి. నాలుగు రోజుల్లో పౌర్ణ‌మి వ‌చ్చేస్తుంది. ఈ పౌర్ణమి త‌ర్వాత వ‌చ్చే కృష్ణ ప‌క్షానికి ప్రాధాన్యం ఉంది.

మ‌నం జీవితంలో ఉన్న‌త స్థితికి చేరాల‌న్నా, చ‌క్క‌గా స్థిర ప‌డాల‌న్నా పెద్దల ఆశీర్వాదం త‌ప్ప‌నిస‌రి. ముఖ్యంగా పితృ దేవ‌తలు సంతృప్తి చెంది ఆశీర్వ‌దించ‌టం ముఖ్యం. అందుకే పెద్ద‌లు స్వ‌ర్గ‌స్తుల‌యిన రోజున (వ‌ర్ధంతి) గుర్తు ఉంచుకొని వారి పేరుతో ఆబ్దికం పెట్ట‌డం లేదా పుణ్య క‌ర్మ‌లు ఆచ‌రించ‌టం లేదా ప్రార్థ‌న‌లు చేయ‌టం చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. అందుకే పెద్ద‌లు అంద‌రినీ ఒక రోజు గుర్తు చేసుకొనేందుకు మ‌హాల‌య పక్షాలు అనే ఏర్పాటు చేశారు. అంటే ఈ భాద్ర‌ప‌ద మాసంలోని కృష్ణ ప‌క్షంలో నిర్దిష్ట మైన రోజును స‌రి చూసుకొని ఈ ప‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఆరోజున ఒక పుణ్య క‌ర్మ చేసే విధంగా మ‌ల‌చుకోవ‌చ్చు. మంత్ర స‌మాప్తిగా భోజ‌నం పెట్ట వ‌చ్చు లేదా పూజ‌లు చేసుకోవ‌చ్చు. క‌నీసం నిరుపేద‌ల‌కు దానం చేయ‌వ‌చ్చు. ఆరోజు చేప‌ట్టే పుణ్య కర్మ‌లు విశేషంగా ఫ‌లిస్తాయ‌ని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత మ‌హాల‌య ప‌క్షాలు పాటించ‌టం మంచిది. కొంద‌రు మాత్రం ఇది ఆన‌వాయితీ లేద‌ని చెబుతుంటారు. కానీ ఇటువంటి మంచి ప‌ని మొద‌లు పెట్ట‌డ‌మే ఆన‌వాయితీ అవుతుంద‌ని గుర్తుంచుకోవాలి.

మ‌ధ్యాహ్న‌మే చ‌వితి వెళ్లిపోతోంది.. సాయంత్రం పూజ చేయ‌వ‌చ్చా..?

వినాయ‌క చ‌వితి రోజున కొంత‌మందికి వ‌చ్చిన సందేహం ఇది. ఎందుకంటే ఇవాళ మ‌ధ్యాహ్న స‌మ‌యంలోనే చ‌వితి వెళ్లిపోతోంది. అటువంట‌ప్పుడు పూజ చేయాలా వ‌ద్దా అనే అనుమానం వెంటాడుతోంది.
వాస్త‌వానికి వినాయ‌క చ‌వితి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్త‌వానికి వేకువ జామునే నిద్ర లేచి రోజు చేసుకొనే నిత్య దేవ‌తారాధ‌న ముందు పూర్తి చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఇంటిల్లిపాది క‌లిసి పాల‌వెల్లి ని అలంక‌రించి, పూజా మందిరాన్ని అలంక‌రించుకొని పూజ‌కు సిద్ద ప‌డాలి. పూజ కోసం వినాయ‌క ప్ర‌తిమ‌ను తెచ్చి పెట్టుకోవ‌టం ఆన‌వాయితీ. ఆ త‌ర్వాత వినాయ‌కుడికి పూజ చేసి నైవేద్యాలు చెల్లించ‌టం ఆన‌వాయితీ. గ‌ణ‌ప‌తి పూజ‌లో ప‌విత్రంగా భావించే ప‌త్రి పూజ‌ను ఆచ‌రిస్తారు.

ఇంటి బ‌య‌ట ఉండే కూడ‌ళ్ల లో, సంస్థ ల్లో, కంపెనీల్లో వినాయ‌కుడ్ని నిలిపి పూజ‌లు చేయ‌టం ఆన‌వాయితీ. సాధార‌ణంగా ఎవ‌రికి వారు ఇళ్ల ద‌గ్గ‌ర పూజ‌లు చేసుకొని విధుల‌కు హాజ‌ర‌య్యాక‌, మ‌ధ్యాహ్న స‌మ‌యంలో లేదా సాయంత్రం స‌మ‌యంలో ఈ సామూహిక పూజ‌లు చేస్తారు. ఈ సారి మ‌ధ్యాహ్న‌మే చ‌వితి వెళ్లి పోతోంది కాబ‌ట్టి ఎలా అనే సందేహం వ్య‌క్తం అయింది. వాస్త‌వానికి ప్ర‌తీ రోజూ తిథి పూర్తిగా ఉండ‌టం జ‌ర‌గ‌క పోవ‌చ్చు. అటువంట‌ప్పుడు సూర్యోదయ స‌మ‌యంలో ఉన్న తిథినే ఆ రోజు తిథిగా భావిస్తారు. అందుచేత సూర్యోద‌య స‌మ‌యంలో ఉన్న తిథిని ఆధారంగా చేసుకొని ఆ రోజుకి సంబంధించిన కార్య‌క‌లాపాలు నిర్ణ‌యించుకొంటారు. అందుచేత ఈ ప్రాతిప‌దిక‌నే ఇవాళ వినాయ‌క చ‌వితి పాటించ‌టం జ‌రుగుతోంది.అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడ్ని పూజించి గ‌ణేశుడి ఆశీస్సులు అందుకోవ‌టం ఆన‌వాయితీ.

వినాయ‌క వ్రతంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశం.. వీలుంటే పాటించి చూడండి..!

వినాయ‌క వ్రతం రెండు రోజుల్లో రానుంది. ఇప్పటికే వ‌రుస శెల‌వులు ఉండ‌టంతో ఏర్పాట్లకు స‌మ‌యం చిక్కింది. ముఖ్యంగా వినాయ‌క వ్రతంలో ప‌త్రిపూజ విశిష్టమైన‌ది. ఈ ప‌త్రి పూజ లో 21 ర‌కాల ప‌త్రులు ఉప‌యోగిస్తారు. ఈ ప‌త్రుల‌ను ఈ రెండు రోజుల్లో సేక‌రించుకొనేందుకు ప్రయ‌త్నిస్తే ఫ‌లితం ఉంటుంది. కానీ సంస్కృతంలో ఉండే ఈ ప‌త్రుల పేర్లు మ‌న‌కు తెలీదే అనుకోవ‌చ్చు. కానీ ఈ ప‌త్రుల పేర్లు తెలుసుకొంటే వీటిని సేక‌రించుకొనేందుకు వీల‌వుతుంది.

బృహ‌తీ ప‌త్రం అంటే వాకుడు ఆకు. ఇది రోడ్ల ప‌క్క లో ఉండే గుబురుగా ఉండే చెట్లు. వాకుడు కాయ‌లు కూడా ప‌చ్చడి పెట్టుకొంటారు. ఈ ప‌త్రాలు లేదా కాయలు శ్వాస‌కోశ వ్యాధుల‌కు విరుగుడుగా ప‌ని చే్స్తాయి. మాచీ ప‌త్రం అంటే ద‌వ‌నం. ద‌వ‌నం ఆకు సువాస‌న ఇస్తుంది. ఆరోగ్యక‌ర‌మైన తేజ‌స్సును స‌మ‌కూర్చును. ఒత్తిడి ని త‌గ్గించేందుకు ద‌వ‌నం ఆకులు న‌మ‌ల‌టం ఉప‌యోగిస్తుంది. ఈ ద‌వ‌నం ఆకులు ఉల్లాసాన్ని క‌లిగిస్తాయి. బిళ్వ ప‌త్రం అంటే మారేడు ఆకులు. మారేడు ఆకు అంటే ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టం. ప‌ర‌మేశ్వరునికి బిళ్వ ప‌త్రి తో పూజ చేస్తే ఎంతో శ్రేష్టం. అందుచేత బిళ్వ ద‌ళాల‌తో వినాయ‌కుడ్ని పూజించినా అంతే మేలు. మారేడు కాయ కూడా రుచిక‌రం, శుచిక‌రం. మారేడు ప‌త్రికి ఉండే వ‌గ‌రు తో విరేచ‌నాల్ని అరిక‌ట్ట గ‌లుగుతుంది. జీర్ణ శ‌క్తిని పెంచుతుంది. దూర్వ యుగ్మం అంటే గ‌రిక‌. గ‌రిక అంటే నేరుగా వినాయ‌కుడికి చాలా చాలా ఇష్టం. ఈ గ‌రిక లో అత్యంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉంటుంది. బ‌ద‌రీ ప‌త్రం అంటే రేగు. రేగు ప‌త్రాలు చ‌ర్మ వ్యాధుల్ని దూరం చేస్తాయి. తుల‌సీ ప‌త్రం అంటే అంద‌రికీ తెలుసు. ప్రతీ ఇంట తుల‌సి ఉండాల‌ని పెద్దలు చెబుతారు. తుల‌సి జ‌లం తీసుకొంటే జీర్ణశ‌క్తి మెరుగవుతుంది. తుల‌సి శ‌రీర ఉష్ణోగ్రత‌ను నియంత్రిస్తుంది. తేజ‌స్సు క‌లిగిస్తుంది. అపామ‌ర్ల అంటే ఉత్తరేణి. శ్వాస కోశ స‌మ‌స్యల‌కు ఇది ప‌రిష్కారం చూపుతుంది. చూత ప‌త్రి అంటే మామిడి. మామిడి కి పుల్ల ద‌నం ర‌క్తాన్ని శుభ్ర ప‌రుస్తుంది. దుర్వాస‌న లేకుండా చేస్తుంది. జాజిప‌త్రి అంటే అంద‌ర‌కీ తెలిసిందే. ఇది చ‌ర్మ రోగాల్ని నియంత్రిస్తుంది. గండ‌క అంటే అడ‌వి మొల్ల, అశ్వథ ప‌త్రం అంటే రావి, అర్జున ప‌త్రం అంటే మ‌ద్ది, అర్క ప‌త్రం అంటే జిల్లేడు, విష్ణు క్రాంత అంటే పొద్దు తిరుగుడు, దాడిమి అంటే దానిమ్మ, సింధువాకం అంటే వావిలాకు, క‌ల‌వీర అంటే గ‌న్నేరు అని అర్థం.
కాస్తంత ఓపిక చేసుకొంటే ఈ ప‌త్రాల్ని సేక‌రించుకొనేందుకు వీలు క‌లుగుతుంది. ఈ ప‌త్రాల్ని తెచ్చుకొంటే వినాయ‌క స్వామికి ఎంతో ఇష్టం గా పూజ చేసుకోవ‌చ్చు.

అవాంత‌రాలు తొల‌గిపోవాలంటే..కాస్త ఆగి, ఈ ప‌ని చేసి చూడండి..!

అవాంత‌రాలు ఏర్ప‌డితే ఏ ప‌ని అయినా ఆగిపోతుంది. విఘ్నాలు ఏర్ప‌డితే ఏ కార్య‌మూ ముందుకు న‌డ‌వ‌దు.
ఇప్పుడు భాద్ర‌ప‌ద మాసం వ‌చ్చేసింది. నాలుగు రోజుల్లో వినాయ‌క చ‌వితి వ‌చ్చేస్తోంది. వినాయ‌క స్వామిని భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో కొల‌వ‌టం మ‌రిచిపోకండి.

**ప్ర‌స‌న్న వ‌ద‌నం ధ్యాయేత్‌, స‌ర్వ విఘ్నోప‌శాంత‌యే** అని చెబుతారు. వినాయ‌కుడ్ని కొలిస్తే విఘ్నములు తొల‌గిపోతాయ‌న్న‌ది న‌మ్మిక. అందుకే వినాయ‌క చ‌వితి రోజు మ‌రిచిపోకుండా ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించాలి. ఉద‌య‌మే నిద్ర లేచి ఒక్క‌సారి వినాయ‌కుడ్ని మ‌న‌సులో ధ్యానించండి . త‌ర్వాత శుచిగా స్నానం చేసి మ‌ట్టితో గ‌ణ నాథుడి ప్ర‌తిమ త‌యారుచేసుకోండి. ఇంటిల్లి పాదిని క‌లుపుకొని పూజా మందిరంలో పూజ‌ను ఆచ‌రించండి. షోడశోప‌చారముల‌తో పూజించ‌టం ఆన‌వాయితీ. షోడ‌శ అంటే 16 ర‌క‌ములైన ఉప‌చార‌ములు చేయ‌టం అన్న మాట‌. ధ్యానావ‌హ‌నాది ఉప‌చార‌ములు చేసి ప‌త్రితో పూజించాలి. ఏక వింశ‌తి ప‌త్రాలు అంటే 21 ర‌కాల ప‌త్రుల్ని వీలైతే సేక‌రించుకొని, లేదంటే కొన్ని ర‌కాల ప‌త్రుల‌తో అయినా స్వామిని పూజ చేయాలి. చ‌క్క‌గా క‌థ చెప్పుకొని విని ప్ర‌సాదాన్ని పంచి తాము కూడా తీసుకోవాలి. వినాయ‌క చ‌వితి రోజు పుస్త‌కాలు అక్క‌డ పెట్టి పూజించ‌టం ఆన‌వాయితీ. చ‌దువు బాగా రావాల‌ని కోరుకొంటూ పిల్ల‌ల చేత ఈ పూజ చేయంచ‌టం మ‌ర‌వ‌కండి. చక్క‌గా ఈ పూజ చేసుకొంటే అవాంత‌రాలు తొల‌గ‌టం ఖాయం.
వీలు కుదిరితే ఈ ప‌ని చేసి చూడండి..!
ప్ర‌తీ రోజూ దేవ‌తారాధ‌న మంచిది అని చెప్పుకొన్నాం క‌దా.. కొన్ని సార్లు ఇది అమ‌లు చేసుకోలేని ప‌రిస్థితి. అటువంటప్పుడు వారంలో ఒక రోజైన కాస్సేపు పూజ కు కేటాయిద్దాం. ఇవాళ ఆదివారం నాడు కాస్తంత పూజాదికాలు చేసుకొన్న వారికి అభినంద‌న‌లు. పూజ త‌ర్వాత మ‌న ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు చ‌క్క‌గా ఉంటాయి. కుటుంబ స‌భ్యుల‌తో అనుబంధాలు కూడా బాగా వ‌ర్థిల్లుతాయి. అటువంట‌ప్పుడు ఈ బంధాల్ని వృద్ధి చేసుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తే మంచిది. ఒక వేళ ఈ ఆదివారాన్ని ఉప‌యోగించుకోలేక పోయారా... ఏమీ ప‌ర్వాలేదు. రేప‌టి రోజు ఉండ‌నే ఉంది.

 సోమ‌వారం, అందునా శ్రావ‌ణ సోమ‌వారం. ప‌ర‌మేశ్వ‌రునికి ఎంతో ఇష్ట‌మైన రోజు. దీన్ని స‌ద్వినియోగం చేసుకొందాం.. ఉద‌యం ఆరు గం. నుంచి 7గం. దాకా చంద్ర హోర ఉంటుంది. వీలైతే ఈ స‌మ‌యంలో పర‌మేశ్వ‌రుడ్ని ఆరాధించేందుకు ప్ర‌య‌త్నించండి. క‌నీసం **ఓం న‌మ‌శ్శివాయ‌** అనే మంత్రాన్ని ప‌ఠించేందుకు ప్ర‌య‌త్నించండి. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు జ‌పించండి. మంచి ఫ‌లితాన్ని ఆస్వాదించండి.
అంతే కాదండోయ్‌.. ప్ర‌తీ మాసంలోనూ చివ‌రి రోజున అమావాస్య వ‌స్తుంది. దీని ముందు రోజు చ‌తుర్ద‌శి ఉంటుంది. దీన్ని మామూలు తిథిగా భావిస్తాం. కానీ, దీన్ని మాస శివ‌రాత్రి అని అంటారు. ప‌ర‌మేశ్వ‌రుడికి ఎంతో ఇష్ట‌మైన రోజు ఇది. ఈ మాస శివ‌రాత్రి రోజున వీలైతే శివాల‌యానికి వెళ్లిరండి. ఒక మంచి ప‌ని చేసిన వార‌వుతారు. లేదంటే ఇంటి ద‌గ్గ‌రే కాస్సేపు ప‌ర‌మేశ్వ‌రుడ్ని ధ్యానించండి...