astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

ఆదివారం నాడు ఈ ప‌ని చేసి చూడండి..!

ఆదివారం అంటేనే ఒక ఆట‌విడుపు. చిన్న‌ప్పుడు స్కూల్ కు వెళ్లేట‌ప్పటి నుంచి కాలేజీ రోజులు, క్యాంప‌స్ క‌బుర్ల‌ను దాటి ఉద్యోగ జీవితాల్లో స్థిర‌ప‌డే దాకా ఇదే కొన‌సాగుతుంది. అందుకే సాధార‌ణంగా ఆదివారం న‌గ‌ర వాసుల్లో చాలా మంది ఉద‌యం పూట నిద్ర కూడా లేవ‌రు. అందుచేత ఆదివారం అంటేనే బ‌ద్ద‌కంగా మొద‌ల‌వుతుంది. కానీ ఇదే ఆదివారాన్ని స‌ద్వినియోగం చేసుకొనే మార్గం కూడా ఉంది..

వాస్త‌వానికి ప్ర‌తీ రోజు కొద్ది సేపు పూజా కార్య‌క్ర‌మాల్లో గ‌డ‌ప‌టం మంచిది. ఉద‌యం కానీ, సాయంత్రం కానీ శుచియై నిశ్చ‌ల‌మైన మ‌నస్సుతో ఆరాధన చేసుకోవాలి. ఇష్ట‌మైన సూక్తాల్ని ప‌ఠించ‌వ‌చ్చు. పారాయణ చేసుకోవ‌చ్చు. ఓం న‌మ శ్శివాయ లేదా శ్రీ సాయి నాథాయ న‌మః వంటి మంత్రాన్ని ఇష్ట మైన‌న్ని సార్లు జ‌పించుకోవ‌చ్చు. లేదంటే ధ్యానం చేసుకోవ‌చ్చు. ఉద‌య‌మే కొద్ది సేపు ఈ ప‌నిచేసి చూడండి. ఆ రోజంతా ఎంతో బాగుంటుంది. వాస్త‌వానికి దైవం వెంట ఉంటే అన్నీ స‌వ్యంగా సాగుతాయి. దైవ బ‌లం గొప్ప‌త‌నమే అది.
ఇక ఆదివారం విష‌యానికి వ‌ద్దాం. ప్ర‌తీ రోజు ఉద‌యం పూట దైవారాధ‌న‌కు స‌మ‌యం వెచ్చించ‌లేని వాళ్లు కానీ, బ‌ద్ద‌కంతో ప‌నులు వాయిదా వేసే వారు కానీ ఆదివారాన్ని స‌ద్వినియోగం చేసుకొంటే మంచిది. చ‌క్కగా కొద్ది సేపు దేవ‌తారాధ‌న‌కు కాలాన్ని వెచ్చించండి. భ‌గ‌వంతునితో మ‌న మ‌నస్సుని జ‌త చేస్తే ఎన్నెన్నో జ్ఞాప‌కాల దొంత‌ర‌లు దొర్లిపోతాయి. దైవం అనుగ్రహాన్ని సంపాదించుకొనేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇందుకు మ‌నస్సు పెడితే చాలు.

హైద‌రాబాద్ లో ఏం మార్పు చోటు చేసుకొంటోంది..!

రాగ‌ల ప‌ది, ప‌దిహేను రోజుల్లో హైద‌రాబాద్ లో సంద‌డి నెల‌కొంటోంది. ఇప్ప‌టికే శ్రావ‌ణ మాసం చివ‌రికి వ‌చ్చేస్తున్నాం. భాద్ర ప‌ద మాసంలో వ‌చ్చే వినాయ‌క చ‌వితి కోసం సంద‌డి మొద‌లైంది. వినాయ‌క విగ్ర‌హాల త‌యారీ పెద్ద ఎత్తున సాగుతోంది. వినాయ‌క ప్ర‌తిమ‌లు తెచ్చుకొని వాటిని భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజించుకొనేందుకు భ‌క్తులు ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే ఈ సారైన మ‌ట్టి విగ్ర‌హాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ వంటి ర‌సాయ‌నాల‌తో చేసిన ప్ర‌తిమలు చూసేందుకు ఆక‌ర్ష‌నీయంగా ఉండ‌వ‌చ్చు గాక‌, కానీ ప‌ర్యావ‌ర‌ణ రీత్యా ఆలోచిస్తే మాత్రం మ‌ట్టి విగ్ర‌హాలు మాత్ర‌మే ఉత్తమం అని చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మండ‌పాల నిర్వాహ‌కులు మ‌ట్టి ప్ర‌తిమ‌ల‌కు ఆర్డ‌ర్ ఇస్తే ఉభ‌య తార‌కంగా ఉంటుంది.