astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

మ‌హిళ‌లు ఈ ప‌ని చేయ‌వ‌ద్దు సుమా..!

మ‌హిళ‌లు, పురుషులు స‌మాన‌మే అయిన‌ప్పటికీ శాస్త్ర రీత్యా కొన్ని ప‌నులు చేయ‌కూడ‌ద‌ని చెబుతారు. అందులో ఇది కూడా ఒక‌టి. దీన్ని భార‌తీయ జీవ‌న విధానం రీత్యా ఆలోచించాల్సిన విష‌యం. తుల‌సీ ద‌ళాల‌ను మ‌హిళ‌లు ఎప్పుడూ కోయ‌కూడ‌దు అని చెబుతారు. ద్వాద‌శి నాడు తుల‌సీ ద‌ళాల‌ను తాక‌రాద‌న్నది శాస్త్రం. పురుషుల చేత కోయించ‌వ‌చ్చు. అయితే పురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ,చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ - పౌర్ణమినాడుగానీ – ఉభయ పక్షాలలో ఏకాదశీ,ద్వాదశీ తిథులలోగానీ – ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు.   తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ, ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి.

మ‌హిళా మూర్తుల‌కు తుల‌సి అర్చన శ్రేయో దాయ‌కం. ఇంట్లో తుల‌సి మొక్కను త‌ప్పకుండా పెంచుకోవాలి. ఉద‌యం స్నానం త‌ర్వాత తుల‌సి అర్చన చేయ‌టం మంచిది. సంక‌ల్పం చేసి, గోత్ర నామాలు చెప్పుకొన్నాక అమ్మ వారి ప్రతిరూపంగా తులసిని భావించి ప్రార్థించాలి. ప‌సుపు, కుంకుమ ల‌తో పూజించాలి. శ్రీ సూక్తం తో కానీ, విడిగా కానీ షోడ‌శ ఉప‌చారాలు స‌మ‌ర్పించాలి. తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ, తులసి చెట్టుమీదా అధికంగా పసుపు,కుంకుమ,అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక, తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం

.త‌ర్వాత తుల‌సీ దేవిని ఈ స్రోత్రంతో జ‌పించాలి.
 నమః తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని
అనంత‌రం తుల‌సీ ద‌ళంలో నీరు పోసి ఆ నీరు తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ వాయు వేగ కాలంలో కొద్ది సేపు తీరిక చేసుకొంటే తుల‌సిదేవి పూజ చేసుకొని అమ్మ వారి ఆశీర్వచ‌నం తీసుకోవ‌చ్చు.

రేప‌టి ప్రాధాన్యం మీకు తెలుసా..!

రేప‌టి శుక్రవారం ఫాల్గుణ శుద్ధ చ‌తుర్థి. ఈ రోజున పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం ఆచ‌రిస్తారు. పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతానికి చాలా ప్రాధాన్యం ఉంది.

క‌లౌ చండీ గ‌ణేశా .. అని చెబుతారు. అంటే క‌లికాలంలో కోరిన కోర్కెలు తీర్చే దేవ‌త‌లుగా వినాయ‌కుడు, దుర్గా దేవి ప్రసిద్ది కెక్కారు.అంటే భ‌క్తి శ్రద్ధ ల‌తో గ‌ణేశుడ్ని అర్చిస్తే కోర్కెలు నెర‌వేరుతాయ‌న్నది న‌మ్మిక‌. త‌ల‌నొప్పి కి మందు వాడితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. జ్వరానికి మాత్ర వేసుకొంటే జ్వరం త‌గ్గుతుంది. అన్ని మాత్రలే అయినా అందులో ఉండే కెమిక‌ల్ కాంపొనెంట్ వేరుగా ఉంటుంది కాబ‌ట్టి ఫ‌లితం వేరుగా ఉంటుంది. అలాగే గ‌ణేశుడికి పూజ‌లు అంతా చేస్తారు. కానీ సంతానం కావాల‌ని కోరుకొనే వారు మాత్రం పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం చేయ‌టం మంచిది. పుత్ర గ‌ణ‌ప‌తిని ధ్యానించుకొని సంక‌ల్పం చేయాలి. స్వామికి పురుష సూక్త విధానంతో కానీ, శ్లోక విధానంలో కానీ షోడశ ఉప‌చారాలు చెబుతూ పూజించాలి. స్వామికి ఇష్టమైన నివేద‌న‌లు చెల్లించ‌టం, గ‌రిక ప‌త్రి తో అష్టోత్తరం లేక స‌హ‌స్రం చేయించ‌టం మంచిది. కొంత‌మంది ఈ వ్రతం రోజున ఉప‌వాసం ఆచ‌రిస్తారు. అంటే ఉద‌యం నుంచి సాయంత్రం దాకా ఆహారం తీసుకోకుండా గ‌డుపుతారు. భ‌క్తి తో పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం చేస్తే సంతానం క‌లుగుతుంద‌న్నది భ‌క్తుల నమ్మిక‌.

గురువారానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది...!


గురు వారం అన్న పేరులోనే దీని ప్రాధాన్యం ఉంది. గురువు అంటే మార్గమును ప్రబోధించువాడు అని అర్థం. గురువు లేని విద్య ను వ్యర్థం అని చెబుతారు. అందుకే ఏ విద్య అయినా గురు ముఖంగా నేర్చుకోవాల‌ని సూచిస్తారు. ఇక గురువారానికి ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసుకోవాలంటే ఒక విశ్లేష‌ణ ఉంది. ఈ విశ్లేష‌ణ అన్ని వారాల పేర్లకు కూడా వ‌ర్తిస్తుంది.

భార‌తీయ ధ‌ర్మం ప్రకారం ఒక రోజు అనేది సూర్యోద‌యం తో ప్రారంభం అవుతుంది. మ‌ర్నాడు ఉద‌యం సూర్యోద‌యం అయ్యే దాకా దాన్ని రోజుగా భావిస్తారు. అంతేకాని ఇంగ్లీషు లెక్క మాదిరి అర్థ రాత్రి పన్నెండు గంట‌ల‌కు రోజు మార‌టం కాద‌న్న మాట‌. అయితే సూర్యోద‌య స‌మ‌యంలో ఏ హోర న‌డుస్తోందో ఆ హోర కు ప్రాధాన్యం ఉంటుంది. అంటే గురు వారం రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో గురు హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి గురు వారం అని పేరు వ‌చ్చింది. త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో శుక్ర  హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి శుక్ర వారం అని పేరు వ‌చ్చింది.త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో శ‌ని   హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి శ‌ని వారం అని పేరు వ‌చ్చింది.త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో ర‌వి  హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి ర‌వి వారం లేక ఆది వారం అని పేరు వ‌చ్చింది. త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో చంద్ర హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి చంద్ర వారం లేక సోమ‌ వారం అని పేరు వ‌చ్చింది. త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో కుజ‌  హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి కుజ వారం లేక మంగ‌ళ వారం అని పేరు వ‌చ్చింది. త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో బుధ   హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి బుధ  వారం అని పేరు వ‌చ్చింది. ఈ విధంగా ఆయా రోజుల‌కు గ్రహాల పేరు మీదుగా పేర్లు ఏర్పడ్డాయి. దీన్నే వెనుక భావం నుంచి కూడా చెప్పవ‌చ్చు. అంటే ఆయా రోజుల పేర్లను బ‌ట్టి హోరా స‌మ‌యాల‌కు పేర్లను నిర్దేశించవ‌చ్చు. ఇదీ మ‌న స‌నాత‌న భార‌తీయ జ్యోతిష శాస్త్ర విశ్లేష‌ణ‌

శివ‌రాత్రి రోజు త‌ప్పని స‌రిగా చేయాల్సిన‌వి..!

ఆది వారం రోజు మ‌హా శివ‌రాత్రి. అంటే సాక్షాత్తు ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజే ప‌ర‌మేశ్వరుడు మ‌హా లింగ రూపంలో ఆవిర్భవించాడ‌ని చెబుతారు. అంత‌టి విశిష్టమైన రోజున ఆచ‌రించాల్సిన విధి విధానాల్ని నిగ‌మ శాస్త్రములు వివ‌రిస్తున్నాయి. ఆగ‌మం అంటే దైవిక క్రియ‌లు అని అర్థం. నిగ‌మ శాస్త్రములు అంటే మాన‌వుడు ఆచ‌రించాల్సిన విధులు అని అర్థం.

మ‌హా శివ‌రాత్రి వేకువ జామునే నిద్ర లేవటం ఉత్తమం. మాఘ మాసంలో సూర్యోద‌యానికి ముందే స్నానం ఆచరించాలి. మిగిలిన రోజుల్లో వీలు కుదిరినా, కుద‌ర‌క పోయినా క‌నీసం శివ‌రాత్రి అయినా వేకువ జామునే నిద్ర లేచి స్నానం ఆచ‌రిస్తే మేలు. సూర్యోద‌యానికి ముందు రెండు గంట‌ల పాటు బ్రాహ్మీ ముహుర్తం అని చెబుతారు. (సుమారుగా) ఈ స‌మ‌యంలో దేవ‌త‌ల‌కు ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది. అందుచేత ఈ స‌మ‌యంలో స్నానాదికాలు పూర్తి చేసి ఇష్ట్ దేవ‌త‌ల్ని పూజించాలి.ఈ రోజున ప‌ర‌మేశ్వరుడ్ని బిళ్వ ద‌ళాల‌తో అర్చిస్తే ఎంతో మంచిది. విభిన్న ద్రవ్యముల‌తో అభిషేకం చేయిస్తే ఎంతో మంచిది. శివుడు అభిషేక ప్రియుడు అని అంద‌ర‌కి తెలిసిన‌దే. అందుచేత ప‌ర‌మేశ్వరుడ్ని వివిధ ర‌కాల ద్రవ్యముల‌తో అభిషేకం, అర్చన చేయిస్తే ఉత్త మ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విభూదితో అభిషేకం చెప్పుకోద‌గిన‌ది.
ఈ రోజున ఉప‌వాసం చేయ‌టం ఆన‌వాయితీ. చాలామంది రోజంతా అంటే మ‌ర్నాడు సూర్యోద‌యం దాకా ఉప‌వాసం ఉంటారు. లేని ప‌క్షంలో రెండు ర‌కాలుగా ఉప‌వాసం చేస్తారు. అంటే ప‌గ‌లంతా ఉప‌వాసం ఉండి, రాత్రి న‌క్షత్ర ద‌ర్శనం త‌ర్వాత భుజిస్తారు. దీన్ని న‌క్తం అని పిలుస్తారు. లేదంటే ప‌గ‌టి పూట ఆహారం తీసుకొని రాత్రంతా ఉప‌వాసం ఉంటారు. దీన్ని ఏక‌భుక్తం అంటారు. ఇందులో ఏ విధానం మేలు అన్నది ఎవ‌రికి వారు ఆలోచించుకోవాలి. మొత్తం ఉప‌వాసం ఉండ‌టం శ్రేయోదాయకం. పూర్తిగా ఆహారానికి దూరంగా ఉంటే ఆరోగ్య స‌మ‌స్యలు వ‌చ్చే చాన్సు ఉన్నందున ద్రవాహారం లేదా ప్రసాదం లేదా పండ్లతో న‌డిపించ‌వ‌చ్చు.
ఇక‌, శివ‌రాత్రి ప్రాశ‌స్త్యం అంతా రాత్రి స‌మ‌యంలోనే ఉంటుంది. ఈ రాత్రి భ‌జ‌న‌లు, పారాయ‌ణాల‌తో జాగారం  చేస్తే ఎంతోమేలు. స‌దా శివ‌న్నామ స్మర‌ణ చేయ‌టం ఉత్తమం. అర్థ రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం, అర్చన‌లు చేయించాలి. ఇది ఎంతో విలువైన స‌మ‌యం కాబ‌ట్టి ప‌ర‌మేశ్వరుడ్ని పూజించి ఆయ‌న కృప‌కు పాత్రుల‌వ‌దాం...

తెలంగాణ అన్నది దోశ వేయటం అన్నంత తేలిక కాదు.. అన్న కామెంట్ చేస్తున్న అల‌జ‌డి పెద్దల‌కు తెలీదా..!

తెలంగాణ మీద కేంద్ర మంత్ర వాయ‌లార్ ర‌వి అన్న కామెంట్ ఇది. దోశ వేయ‌టం అన్నంత తేలిక కాదు. అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆయ‌న చెప్పద‌లుచుకొన్న అంశం.. తెలంగాణ విష‌యం ప‌రిష్కారం క్లిష్టమైన‌ది అని చెప్పట‌మే. ఇందుకోసం ఆయ‌న అన్న కామెంట్ ఎన్నో ల‌క్షల మందిని క‌ల‌వ‌ర పరిచింది. అంటే ఒక వాక్యాన్ని పెద్ద స్థాయిలో ఉన్న వారు అన‌టం వ‌ల‌న ల‌క్షల మందిలో ఒక ర‌క‌మైన ఉద్వేగాన్ని క‌లిగించింది. ఎందుక‌ని.. అదే కేంద్ర మంత్రి తెలంగాణ సెంటిమెంట్ చాలా మందిలో బ‌లం గా ఉన్నందున‌, అటు స‌మైక్య వాదంపై సీమాంధ్ర లో వాద‌న వినిపిస్తున్నందున .. దీనిపై తేల్చటం క‌ష్టత‌రం అవుతోంది అని చెబితే ఎవ‌రికీ ఇబ్బంది క‌లిగేది కాదు. కానీ కేంద్ర మంత్రి ఒక వాక్యంలో చేసిన కామెంట్ తో పేప‌ర్లలో మొద‌టి పేజీ వార్తలు, టీవీ చానెల్స్ లో ప్రైమ్ టైమ్ డిస్కష‌న్ లు న‌డుస్తున్నాయి.
అదే మాట‌లో ఉండే మ‌హిమ‌. కొన్ని అక్షరాల్ని క‌లిపి ప‌దాలు, ప‌దాల్ని క‌లిపిన వాక్యాల్ని వాడిన‌ప్పుడు క‌లిగే ప్రభావం ఇది.

మంత్ర శాస్త్రంలో ఉండే మ‌హిమ కూడా ఇదే. మంత్రాల్ని స్వర‌యుక్తంగా శాస్త్ర బ‌ద్దంగా ఉప‌యోగిస్తే అద్భుత ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. ఎందుకంటే మంత్రాల ద్వారా వెలువ‌డే వైబ్రేష‌న్స్ శ‌క్తి మంతంగా ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నట్లు గా గ్రహాల అశుభ దృష్టి తాకుతున్నప్పుడు ప‌రిష్కారం గా మంత్ర జ‌పం చెబుతారు. అంటే ఏమిటి.. ఆ గ్రహానికి ఇష్టమైన మంత్రాన్ని అనేక సార్లు అంటే వంద‌ల‌సార్లు, వేల సార్లు జ‌పించ‌మంటారు. దీని కార‌ణంగా ఆ గ్రహానికి ప్రీతి క‌లిగి మేలు క‌లుగుతుంది. ఇష్టంలేని వాక్యాన్ని ఒక్కసారి ప‌లికితే ఎంత‌టి క‌ల‌వ‌రం క‌లిగిందో ఇందాక ఉదాహ‌ర‌ణ‌లో చూశాం. అదే ఇష్టమైన వాక్యం ప‌లికితే అంతే స్థాయిలో ఆనందం క‌లుగుతుంది. న‌చ్చిన వ్యక్తి మ‌న‌ద‌గ్గర‌కు వ‌చ్చి ఐ లైక్ యూ అని చెబితే పొంగి పోతాం. మీరు మంచి వారు, మీరు చ‌క్కటి వారు అని చెబితే సంతోషిస్తాం.అదే మాట వంద‌ల సార్లు, వేల సార్లు చెబితే ఎంత‌టి సంతోషం క‌లుగుతుంది ..
ఇక అదే మంత్రాల‌ను సుస్వర యుక్తంగా సుసంప‌న్నం చేయ‌వ‌చ్చు. ప‌దం రూపంలో, క్రమ రూపంలో, జఠ రూపంలో, ఘ‌న రూపంలో చెబితే క‌లిగే వైబ్రేష‌న్స్ అంతా ఇంతా కాదు. ఈ వైబ్రేష‌న్స్ ద్వారా చ‌క్కటి ఫ‌లితాలు క‌లుగుతాయి. అదే లాజిక్ ను జ్యోతిష శాస్త్రం అప్లయ్ చేస్తుంది. చ‌క్కటి ప‌రిష్కారాన్ని చూప‌టం ద్వారా మాన‌వ జీవితానికి జ్యోతి మాదిరిగా వెలుగు చూపేదే జ్యోతిష్ శాస్త్రం. స‌ర్వే జ‌నా సుఖినో భ‌వంతు..

క‌నీసం ఈ సోమ‌వారం అయినా ప్రయ‌త్నించండి..!

సోమ‌వారం వ‌చ్చిందంటే ఒక మంచి అనుభూతి.. ఎందుకంటే ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అది. మాసాల్లో కార్తీక మాసం త‌ర్వాత అంత‌టి విశిష్టమైన మాసం మాఘ‌మాసం. ఈ సోమ‌వారం స‌ప్తమి తిథి తో క‌లిసి ఉన్నది కాబ‌ట్టి దేవ‌తారాధ‌న‌కు మంచి రోజు. ప‌ర‌మేశ్వరుడ్ని అర్చించుకొనేందుకు,సూర్య భ‌గ‌వానుడ్ని ఆరాధించుకొనేందుకు ఇది మంచి స‌మ‌యం. ఉద‌య‌మే లేచి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి.
కరాగ్రే వసతే లక్ష్మీః,
కర మధ్యే సరస్వతీ,
కరమూలే స్థితో బ్రహ్మా,
ప్రభాతే కర దర్శనం
                చేతి అగ్ర భాగము-ముందు లక్ష్మీ దేవివసించి యున్నది.చేతి మధ్య భాగమునందు చదువుల తల్లి సరస్వసతీ దేవివిరాజిల్లుతున్నది.చేతి మూలమునందు బ్రహ్మ దేవుడు నివసించియున్నాడు.కావున ప్రాతఃకాలమునందూ ఇట్టి దివ్యమైన భావముతో రెండు చేతులను దర్శించాలి.ఆ పిదప
సముద్ర వసనే దేవి!
పర్వతస్తన మండలే,
విష్ణు పత్ని నమస్తుభ్యం,
పాదస్పర్శం క్షమస్వమే!
సముద్రము వంటి వస్త్రములను ధరించినట్టి,పర్వత స్వరూప స్తనములతో,శ్రీ విష్ణు భగవానుని పత్నియగు ఓ పృధ్వీ దేవీ నీవు దయతో నా పాద స్పర్శను క్షమింపుము.అని భూ మాతను క్షమాపణ పూర్వకంగా ప్రార్ధించాలి. ఆత‌ర్వాత శాస్త్ర ప్రకారం స్నానం చేసి, చ‌క్కగా దేవ‌తారాధ‌న‌కు పూనుకోవాలి. ఈ రోజున ఆదిత్యుడ్ని పూజించుట మేలు. ఆదిత్య హృద‌యం పారాయణంతో ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి.

రాగి పాత్రలో గరిక, పాలు, ఎర్రచందనం, మందార పువ్వులు కలిపిన పదార్థంతో సూర్య నారాయణ స్వామికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యం ఇస్తే స్వామి సంతృప్తి చెందుతారని, భక్తులకు భోగభాగ్యాలిచ్చి వచ్చే జన్మలో ఎటువంటి రోగాలు దరిచేరకుండా దీర్ఘాయిష్సు ప్రసాదిస్తారని నమ్మకం. భక్తులు మరణానంతరం సూర్యలోకం చేరుతారని  చెబుతారు. ఆ త‌ర్వాత ప‌ర‌మేశ్వరుడ్ని మారేడు ప‌త్రాలు, పుష్పాల‌తో అర్చించుకోవాలి. ప‌ర‌మేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబ‌ట్టి మ‌న‌సా, వాచా భ‌క్తితో అభిషేకం, అర్చన చేసుకోవచ్చు. ఇటువంటి విశిష్టమైన రోజున ఉప‌వాసం చేయ‌వ‌చ్చు. అంటే ఇది ఆరు ర‌కాలు ఉన్నప్పటికీ, ఏక‌భుక్తం మేలు. ఏకభుక్తం (ఒంటిపూట) చేస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలో ఉన్న ఉబ్బసరోగాలు, శ్వాసకు సంబంధించిన రోగాలు, నరాల వ్యాధులు నశిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. తెల్లజిల్లేడు, పందిరి చిక్కుడు ఆకులకు, రేగు పళ్లకి, సౌరశక్తిని నిలువ చేసే శక్తి ఎక్కువగా వుంటుంది. వీటిపై ఉంచిన ప్రసాదాన్ని భుజించడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే రథసప్తమి రోజున శిరస్సు మీద, భుజాలు మీద తెల్ల జిల్లేడు ఆకులు, రేగుపళ్లు పెట్టుకొని స్నానం చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.