astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

రేపటి విశిష్టత మీకు తెలిసే ఉంటుంది..!

రోజుల విశిష్టత, ప్రాధాన్యం తెలుసుకొంటే భ‌లే ఆస‌క్తిగా ఉంటుంది. ముఖ్యంగా అంత‌కు ముందు తెలిసిన విష‌యాలే అయినా ఆయా రోజుల‌కు ప్రాధాన్యం ఉంటే బ‌హు చ‌క్కగా ఉంటుంది. అదే విష‌యాన్ని గుర్తుకు తెచ్చుకోవ‌టంతో పాటు ఆచ‌ర‌ణ‌లో పెట్టుకొనేందుకు వీలవుతుంది.

రేపు సోమ‌వారం అన‌గా ఫిబ్రవ‌రి 25వ తేదీన మాఘ పౌర్ణమి ఏర్పడుతోంది. కార్తీక మాసం త‌ర్వాత అంత‌టి విశిష్టత ఉన్న మాసంగా మాఘ మాసాన్ని చెబుతారు. అందుకే కార్తీక పౌర్ణమి త‌ర్వాత అంత‌టి ప్రాధాన్యం ఉన్న రోజుగా మాఘ పౌర్ణమిని వ‌ర్ణించ‌వచ్చు. మాఘ మాసంలో స్నానం, దానం ప్రత్యేకంగా చెప్పద‌గిన‌వి. అందుకే మాఘ‌పౌర్ణమి రోజున కూడా ప‌విత్ర స్నానాలు ఆచ‌రిస్తారు. ఆ రోజున వేకువ జామునే పుణ్య స్నానాలు ఆచరిస్తారు. పైగా సోమ‌వారం కూడా క‌లిసి రావ‌టంతో ప‌ర‌మేశ్వరునికి అర్చన‌లు, అభిషేకాలు చేయిస్తారు. ఉన్నంత‌లో కొంత మొత్తాన్ని దానంగా చేయ‌టం మంచిద‌ని చెబుతారు.
ఈ సారి మ‌హా కుంభ మేళా జ‌రుగుతుండ‌టంతో అల‌హాబాద్ (ప్రయాగ‌) లో పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు చేయ‌బోతున్నారు. గంగ, య‌మున‌, స‌రస్వతీ న‌దుల స‌మ్మేళ‌నంలో పుణ్య స్నానం చేయ‌టం పవిత్రంగా భావిస్తారు. దాదాపుగా 80 ల‌క్షల మంది భ‌క్తులు రేప‌టి రోజుల స్నానాలు ఆచ‌రిస్తార‌ని అంచ‌నా వేస్తారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఈ సంఖ్య కాస్త త‌గ్గ వ‌చ్చని భావిస్తున్నారు. పుష్య మాస‌పు పౌర్ణమి నుంచి మాస‌పు వ్రతం ఆచరిస్తున్న వారు ఈ మాఘ పౌర్ణమితో దీక్షను విర‌మిస్తారు. 

హైద‌రాబాద్ పేలుళ్ల గురించి ముందుగా చెప్పింది ఎవ‌రు..! ఎలా చెప్పగ‌లిగారు..!


ఏ విష‌యం అయినా ముందుగా చెప్పిన వారి గురించే చెప్పుకొంటారు. కానీ ఎలా చెప్పగ‌లిగారు, ఇది ఎలా సాధ్యం అనేది ఆలోచించ‌రు. అలాగ‌ని చాలా సూటిగా ఫ‌లానా చోటే, ఫ‌లానా స‌మ‌యంలోనే, ఫలానా వ్యక్తులే పేలుళ్లు చేస్తారు అని చెప్పటం కుద‌రదు. కానీ, ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌చ్చు అని మాత్రం చెప్పవ‌చ్చు. మ‌న ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇదే మాదిరిగా హెచ్చరిక‌లు చేస్తూ ఉంటుంది. నిర్దిష్టంగా, ఈ మాదిరిగా జ‌రుగుతుంద‌ని చెప్పలేరు. కానీ ఘ‌ట‌న చోటు చేసుకొనే అవ‌కాశం ఉంటుందని హెచ్చరిక చేయ‌గ‌లుగుతారు.
పేలుళ్ల వంటి విధ్వంస కాండ చోటు చేసుకోవ‌డానికి జ్యోతిష శాస్త్ర వేత్తలు ముందుగానే విశ్లేషించ‌గ‌లిగారు. నంద‌న నామ సంవ‌త్సరానికి సంవ‌త్సర అధిప‌తి గా కుజుడు ఉండ‌టం, సేనాధిప‌తిగా గురుడు వ్యవ‌హ‌రిస్తుండ‌టం జ‌రుగుతోంది. ఈ ఇద్దరూ గోచార రీత్యా స్థాన‌ములు మారుతున్నారు. ఈ స‌మ‌యంలో ఇటువంటి విళ‌య కాండ జ‌ర‌గ‌వ‌చ్చన్నది జ్యోతిషుల అంచ‌నా. దీని కారణంగా స‌మాజంలో సంఘ‌ర్షణ చోటు చేసుకొంటుంద‌ని విశ్లేషించ‌గ‌లిగారు.
జ్యోతిషం కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరిక మాదిరిగానే ప‌ని చేస్తుంది. ఈ స‌మ‌యంలో ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకొనే అవకాశం ఉంటుంద‌ని మాత్రం చెప్పగ‌ల‌రు. అయితే దీనికి ఆయా నగ‌రాల జ‌న్మ ల‌గ్నం, వాస్తు వంటి అంశాల ప్రాతిప‌దిక‌న ఎక్కడ చోటు చేసుకోవ‌చ్చు అన్నది విశ్లేషించేందుకు వీల‌వుతుంది. అంతే గానీ, ఫ‌లానా తేదీ, ఫ‌లానా గంట‌, ఫ‌లానా స‌మ‌యం, ఫ‌లానా వీధి, ఫలానా సెంట‌ర్ అనేది చెప్పటం క‌ష్టంగా ఉంటుంది. అందుచేత శాస్త్రీయంగా న‌మ్మకాన్ని ఉంచి ఆలోచిస్తే ముందుగానే ప‌సిగ‌ట్టడం ఎలా సాధ్యం అనేది అర్థం అవుతుంది.

సడెన్ గా వ‌ర్షం ఎందుకు ప‌డిన‌ట్లు..!

ఫిబ్రవ‌రి నెల‌లో ఒక్క సారిగా వాన‌లు కురిశాయి. అకాల వ‌ర్షాల‌కు అనేక చోట్ల పంట‌లు దెబ్బతిన్నాయి. 52 వేల ఎక‌రాల్లో పంట నీట మునిగింది. ఇంత‌కీ ఫిబ్రవ‌రిలో వాన‌లు ఎందుకు ప‌డుతున్నాయి అనే అనుమానం కలుగ వ‌చ్చు.

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టద‌న్నది న‌మ్మకం. వాన‌లు ప‌డటాన్ని కూడా ఇదే కోణం లో అర్థం చేసుకోవ‌చ్చు. నంద‌న నామ సంవ‌త్సరానికి రాజు గా శుక్రుడు ఉన్నాడు. ధాన్యాధిప‌తి శ‌ని, అర్ఘాధిప‌తి గురుడు, మేఘాధిప‌తి గురువు, ర‌సాధిప‌తి గురువు, నీర‌సాధిప‌తి కుజుడు గా ఉన్నారు. ఆవ‌ర్తక నామ మేఘ‌మున గాని మంచి ధాన్యం, గోధుమ‌లు, జొన్నలు, సెన‌గ‌లు, ప‌త్తి, నూనె గింజ‌లు మొద‌లగు వాని ఉత్పత్తికి హాని క‌లుగుతుంద‌ని జ్యోతిషులు ఈ ఏడాది ప్రారంభంలోనే అంచ‌నా వేశారు. ఈ ఏడాది వ‌ర్ష కుండ‌లి రీత్యా తులా లగ్నం అయింది. వ‌ర్ష ప్రమాణం స‌ముద్ర మందు ఏడుభాగ‌ములు, ప‌ర్వత‌ములందు తొమ్మిది భాగ‌ములు, భూమిపై నాలుగు ప్రమాణ‌ములు ఉండును. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వ‌ర్షము ఉంటుంద‌ని ముందుగానే విశ్లేషించ‌డ‌మైన‌ది. ఇందులో భాగంగానే ఆక‌స్మికంగా వాన‌లు పోటెత్తాయి. తెలంగాణ‌, రాయ‌ల‌సీమ జిల్లాల్లో మ‌రిన్ని వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అర్థం అవుతోంది. మొక్క జొన్న, పొద్దు తిరుగుడు, జొన్న, వేరుశ‌న‌గ‌, శ‌న‌గ‌, మిర‌ప‌, అర‌టి, నువ్వుల పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. ఈ అకాల వ‌ర్షాలు శాంతించి రైత‌న్నకు ఊర‌ట క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుడ్ని ప్రార్థిద్దాం..!

రేప‌టి రోజున త‌ప్పకుండా గుర్తు పెట్టుకోండి...!

రేప‌టి ఆదివారానికి ఒక ప్రత్యేక‌త ఉంది. మాఘ‌పు ఆదివారం అంటే సూర్య భ‌గ‌వానుడి అర్చన‌కు ఎంతో ప్రాశ‌స్త్యమైనది. ప్రతీ మాఘ ఆదివారం నాడు వేకువ జామునే లేచి సూర్యోద‌యం అయిన పిమ్మట ఎండ త‌గిలే చోట సూర్యుడ్ని ఆవాహ‌న చేసుకొని పూజ‌లు చేసుకొంటారు. ఈఏడాది ర‌థ స‌ప్తమి కూడా ఆదివారం నాడే వ‌చ్చింది. దీంతో సూర్యుడ్ని ఆరాధించ‌టానికి మ‌రింత మంచి స‌మ‌యం వచ్చింద‌నుకోవ‌చ్చు.

 ర‌థ సప్తమి రోజు న వీలుంటే న‌దీ స్నానం ఆచ‌రించ‌టం మేలు. లేని ప‌క్షంలో ఇంటిలోనే వేకువ జామున స్నానం చేయాలి. ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి

॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥

॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥

॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥

అనంత‌రం ప్రశాంతంగా సూర్య దేవుడ్ని అర్చించుకోవాలి. చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయ‌లు, చిక్కుడు పువ్వులతో పూజ చేస్తారు. పాయ‌సం వండి వేడి వేడిగా సూర్యుడికి నివేద‌న చేస్తారు. ర‌థ స‌ప్త మి రోజు ఉద‌యం పూజ‌తో ప‌నులు ప్రారంభిస్తే మంచింది. ఈ స‌మ‌యంలో ఆదిత్య హృద‌యం పారాయ‌ణం చాలా మంచిది. ఆదిత్య హృద‌యం విశిష్టత గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రామాయణ కాలంలో రామచంద్ర ప్రభువు దీంతో ప్రభావితం అయిన‌ట్లు చెబుతారు. ఆదిత్య హృద‌యం పారాయణం తో రోగాలు నివార‌ణ అవుతాయ‌ని, మానసికంగా ధైర్యం క‌లుగుతుంద‌ని భ‌క్తుల న‌మ్మిక‌. ఏమాత్రం అవ‌కాశం ఉన్నా ఆదిత్య హృద‌యం పారాయ‌ణ మరిచిపోవ‌ద్దు.



ఈ రోజు ఈ ప‌ని చేయ‌టం మ‌రిచిపోవ‌ద్దు..!

ఎంత‌టి వారి కైనా మ‌ర‌పు అన్నది స‌హ‌జం. ప‌నుల ఒత్తిడిలో ఉన్నప్పుడు, టెన్షన్ కు గురైన‌ప్పుడు మ‌రిచి పోవ‌టం అన్నది చోటు చేసుకొంటుంది. కానీ ముఖ్యమైన ప‌ని పెట్టుకొన్నప్పుడు మాత్రం మ‌రిచిపోకుండా ఉండాలి సుమా..!

వ‌సంత పంచ‌మి లేక శ్రీ పంచ‌మి అన్నది స‌ర‌స్వతీ అమ్మ వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున అమ్మల గ‌న్నయ‌మ్మ ను స‌రస్వతి రూపంలో అర్చించుకోవ‌టం చాలా శుభ‌క‌రం. స‌రస్వతీ దేవి కొలువైన బాస‌ర‌, వ‌ర్గల్ వంటి క్షేత్రాల్ని సంద‌ర్శిస్తే మంచిదే. లేదా ఇటీవ‌ల కాలంలో ప్రతీ ప్రాంతంలోనూ స‌ర‌స్వతీ దేవి ఆల‌యాలు ఉంటున్నాయి కాబ‌ట్టి ద‌గ్గర‌లోని స‌ర‌స్వతి ఆల‌యానికి వెళ్లి అర్చన‌లు జ‌రిపించుకోవ‌చ్చు. క‌నీసం ఇంటి దగ్గర అయినా స‌ర‌స్వతీ దేవిని భ‌క్తి శ్రద్దల‌తో పూజించుకోవాలి. ముఖ్యంగా ఈ పూజను పిల్లల చేత చేయించాలి. విద్యాభివృద్ధికి, విజ్ఞాన వికాసానికి స‌ర‌స్వతీ దేవి అనుగ్రహం ఎంతో ముఖ్యం.
ఇంటిలోనే పూజ చేసుకోద‌లిస్తే శ్రీ సూక్త విధానంగా షోడ‌శోప‌చార పూజ చేసుకోవ‌చ్చు. షోడ‌శోప‌చార పూజ అంటే 16 ర‌క‌ములైన ఉప‌చార‌ములు అమ్మ వారికి స‌మ‌ర్పించు అర్చించే విధానం. ఇది ల‌ఘువుగా చేసుకోవ‌చ్చు. అనంత‌రం కుంకుమార్చన చేయ‌టం మేలు. ఉద‌యం పూట ఆఫీసుకి వెళ్లాల్సిన హ‌డావుడి ఉంటే సాయంత్రం పూట చేసుకోవ‌చ్చు. ప్రశాంతంగా అమ్మవారిని మ‌న‌సా వాచా త‌ల‌చుకొని ఈ పూజ చేసుకోవ‌చ్చు. త‌ర్వాత ల‌లితా స‌హస్రం, స‌రస్వతీ సూక్తం వంటివి పారాయ‌ణ చేసుకోవ‌చ్చు.

మాఘ మాసం ఎప్పుడోస్తుందో..!

మాఘ మాసం ఎప్పుడు వ‌స్తుందో అని ఎదురు చూడాల్సిన ప‌ని లేదు. ఇప్పటికే మాఘ మాసం వ‌చ్చేసింది. ప్రతీ మాసానికి ఒక విశిష్టత ఉన్నట్లే ఈ మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివ కేశ‌వులు ఇద్దరికీ ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది. అంతే కాకుండా పితృ దేవ‌త‌ల ఆరాధ‌న‌కు కూడా త‌గిన రోజుగా చెప్పవ‌చ్చు. ఈ మాసంలో స్నాన‌ము ప్రత్యేకంగా చెప్పద‌గిన‌ది. ఎందుకంటే ఈ మాసం సూర్య భగ‌వానుడికి ఎంతో ఇష్టమైన‌ది అందుచేత ఈ మాసంలో ప్రాతః కాలంలో విధి విధానంగా స్నానం చేస్తే పుణ్యలోక ప్రాప్తి క‌లుగుతుంది.  సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపములనూ పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలములో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహమునందు స్నానమాచరించిన వారు పితృ , మాతృ వంశములకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి , పిదప అమర దేహుడై స్వర్గమునకు వెళతాడు. అరుణోదయము కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు. సూర్యోద‌య‌మున‌కు ముందే స్నానం చేస్తే ఉత్తమం. సూర్యోద‌య స‌మ‌యంలో స్నానం మ‌ద్యమం. సూర్యోద‌యం త‌ర్వాత స్నానం చేస్తే త‌క్కువ ఫ‌లితం ఉంటుంది. మిగిలిన రోజుల‌తో పోలిస్తే పౌర్ణమికి ముందు మూడు రోజులు మ‌రింత ప్రాశ‌స్త్యం అనుకోవ‌చ్చు. శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు దానం చేయాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.

    నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి. దీన్ని మాఘ వ్రతం అంటారు. పురాణముల‌ ప్రకారము , బ్రహ్మచారి , గృహస్థు, వానప్రస్థుడు , భిక్షకుడు , బాలురు , వృద్ధులు, యువకులు , స్త్రీలు , నపుంసకులు  అందరూకూడా మాఘమాసమందు శుభమైన తీర్థమందు స్నానం చేసి, కోరిన ఫలమును పొందుతారు. అవయవములు దృఢం గా ఉన్నవారు చన్నీటి తోను , లేనివారు వేడి నీటి తోను స్నానం చెయ్యవచ్చు. పుష్య పౌర్ణమి గడిచాక మాఘ పౌర్ణమి వచ్చే వరకు విష్ణుపూజ విధిగా చేయాలి.
ఈ మాసంలో సూర్యారాధ‌న చెప్పద‌గిన‌ది. ముందే చెప్పినట్లుగా ఈ మాసం ఆయ‌న‌కు ఎంతో ఇష్టమైన‌ది. ముఖ్యంగా ఆదివారం నాడు సూర్య భ‌గ‌వానుడ్ని త‌ప్పక అర్చించాలి. ఆ రోజున సూర్యుని వైపు తిరిగి పూజ చేసుకొంటారు. సంక‌ల్పం చేసుకొని చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయ‌లు సేక‌రించి ర‌థం చేస్తారు. దీనిపై సూర్య భ‌గ‌వానుడ్ని లోహ రూపంలో ఆవాహ‌న చేసుకొంటారు. సూర్యుడ్ని షోడ‌శ ఉప‌చార‌ముల‌తో పూజించి పాయ‌సం లేక పొంగ‌లి త‌యారుచేసి నివేద‌న చేస్తారు. పాలు పొంగిన‌ట్లు సౌభాగ్యం పొంగాల‌ని వేడుకొంటారు. ఇది ఎప్పటినుంచో ఉన్న ఆన‌వాయితీ.
ఇక ఈ మాసంలో వ‌చ్చే విశిష్ట పండుగ ర‌థ స‌ప్తమి. దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి  అని అంటారు.       ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేస్తే , షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి , సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి.  నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి  భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి.      సూర్యుణ్ణి   ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనం తో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వివస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి.
మాఘ మాసంలో మంచి ఆలోచ‌న‌ల‌తో చ‌క్కటి ఆరాధ‌న‌లు చేసుకొని మాఘ మాస ప్రత్యేక‌త‌ను చాటుదాం.. శుభ‌మ‌స్తు..!

ఫిబ్రవ‌రి 14 వేలంటైన్స్ డే మాత్రమే కాదు.. ఇంకో ప్రత్యేక‌త కూడా ఉంది..!

ఫిబ్రవ‌రి 14 అంటే చాలామందికి వేలంటైన్స్ డే గుర్తుకొని వ‌స్తుంది. దీన్ని ప్రేమికుల రోజుగా ఈ కాల‌పు యూత్ గుర్తుంచుకొంటారు. ఈ సంవ‌త్సరం ఫిబ్రవ‌రి 14 కు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే మాఘ శుద్ధ పంచ‌మి అంటే వ‌సంత పంచ‌మి అని అర్థం. చ‌దువుల తల్లి స‌రస్వతి దేవి కి ఎంతో ప్రీతిక‌ర‌మైన రోజు. అందుకే వ‌సంత పంచ‌మి రోజున అమ్మవారిని అర్చించుకోవ‌టం ఉత్తమం.

భార‌తీయ సంప్రదాయంలో స‌రస్వతీ దేవికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ వాణీ గిరిజాశ్చర‌యా... అంటూ అమ్మల గ‌న్న అమ్మ వారిని త‌ల‌చుకొని వాజ్మయం మొద‌లైంది. అంటే సాహిత్యం మొద‌లైన‌దే అమ్మ వారి ప్రస్తావ‌న‌తో అంటారు. అందుకే ఏదైనా కార్యక్రమం మొద‌లు పెడితే శ్రీ‌కారం చుట్టార‌ని చెబుతారు. ఎందుకంటే సాహిత్య సృష్టి అన్నది శ్రీ కారంతో మొద‌లైంది కాబ‌ట్టి శ్రీ‌కారం చుట్టడం అన్న నానుడి ప్రారంభం అయింది. ఈ విష‌యం ప‌క్కన పెడితే .. స‌ర‌స్వతి దేవిని కొలిచాకే విద్యను అభ్యసించ‌టం ఆన‌వాయితీ. అందుకే చ‌దువుకొంటున్న వారంతా ఈ వ‌సంత పంచ‌మి రోజున క‌చ్చితంగా స‌ర‌స్వతీ పూజ చేసుకోవాలి. క‌నీసం స‌ర‌స్వతీ స్తోత్రాన్ని ప‌ఠించాలి. వ‌సంత పంచ‌మి రోజున భ‌క్తి తో పుస్తకాలు అమ్మవారి స‌మ‌క్షంలో ఉంచి పూజించ‌ట ఆన‌వాయితీ.
స‌ర‌స్వతీ న‌మ‌స్తుభ్యం వ‌ర‌దే కామ‌రూపిణీ
విద్యారంభం క‌రిష్యామి సిద్దిర్భవ‌తు మే స‌దా..!
ప‌ద్మ ప‌త్ర విశాలాక్షీ ప‌ద్మ కేస‌ర వ‌ర్థిని
నిత్యాం ప‌ద్మాల‌యాం దేవీం సామాంపాతు స‌ర‌స్వతీ..!
అంతే గాకుండా అమ్మవారి ఆరాధ‌న‌కు వ‌సంత పంచమి మంచి రోజు.  ఆ రోజున మాఘ శుద్ద పంచ‌మి రోజున అమ్మ వారి ని శ్రీ సూక్త స‌హితంగా అర్చిస్తే మేలు. వేకువ జామున లేచి త‌ల స్నానం చేసి పువ్వులు, కుంకుమ‌తో అమ్మ వారి ఆరాధ‌న చేసుకోవాలి. పాయసం వండి నైవేద్యం చెల్లించ‌వ‌చ్చు. ఉద‌యం పూట కాలేజీల‌కు, ఆఫీసుల‌కు ప‌రిగెత్తినా క‌నీసం సాయంత్రం అయినా శ్రేష్టంగా పూజ చేసుకోవ‌చ్చు. పూజ‌కు భ‌క్తి ముఖ్యం క‌దా..!

మంచి చెడు ఎలా చెప్పుకోవ‌చ్చు...!

మంచి అన్నది ఎప్పుడు మంచే. మంచి స‌మ‌యం అన్న దానికి స్పష్టమైన నిర్వచ‌నం ఏమీ లేదు. పంచాంగం ప్రకారం కొన్ని వేళ‌ల్ని మంచి స‌మ‌యంగా గుర్తిస్తారు. ఇందుకు కొన్ని ప్రాతిప‌దిక‌లు ఉన్నాయి. మొద‌ట‌గా తిథిని చూసుకొంటారు. సాధ్యమైనంత వ‌ర‌కు విదియ‌, పంచ‌మి, స‌ప్తమి, ద‌శ‌మి, ఏకాద‌శి, త్రయోద‌శి ని శుభ‌ప్రదం గా భావిస్తారు. దీని త‌ర్వాత న‌క్షత్రాన్ని ప‌రిగ‌ణ‌న లోకి తీసుకోవాలి. తాము పుట్టిన న‌క్షత్రం నుంచి ఆ రోజు న‌క్షత్రం ఏ సంఖ్యలో ఉందో చూసుకోవాలి. 2, 4, 6, 8, 9 సంఖ్య వ‌స్తే మంచిద‌ని చెబుతారు. ఇది శాస్త్రీయ‌మైన గ‌ణ‌న గా భావించాలి. దీని త‌ర్వాత రాహుకాలం, య‌మ‌గండం, గుళికా కాలం లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు చాలా మంది హోర చూసుకొంటారు. శుభ గ్రహ స‌మ‌యం ఉన్నప్పుడు మేల‌ని చెబుతారు. అయితే ప్రతీ ప‌నికి ఇవ‌న్నీ చూసుకోవాల‌ని కాదు. రోజు చేసే ప‌నుల‌కు కూడా ఇవ‌న్నీ చూసుకొంటే ప‌నులేవీ ముందుకు సాగ‌వు. అలాగ‌ని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లటం కూడా స‌రికాదు. అయితే ఏదైన పెద్ద ప‌నులు సంక‌ల్పించిన‌ప్పుడు మాత్రం ముహుర్త శాస్త్రం తెలిసిన వారి ద‌గ్గర ముహుర్తం పెట్టించుకోవ‌టం ఉత్తమం.