astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

విశ్వరూపం సినిమాకు క‌ష్టాలు అందుకేనా..!

విశ్వ రూపం సినిమా ఈ మ‌ధ్య కాలంలో బాగా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా విడుద‌ల మీద వివాదాలు న‌డుస్తున్నాయి. ఈ అంశం ఇప్పటికే హైకోర్టు దాకా వెళ్లింది. ఈ సినిమా విడుద‌ల కాక‌పోతే తాను పూర్తిగా క‌ష్టాల్లో ఇరుక్కొని పోతాన‌ని క‌మ‌ల్ స్వయంగా చెప్పారు.

అస‌లు సినిమా వంటి క‌ళా రూపాలు మొద‌లు పెట్టిన‌ప్పుడు చాలా అంశాలు చూసుకొంటారు. అందులో ముహుర్తం కూడా ఒక‌టి. ఒక పని ప్రారంభించేటప్పుడు సరైన స‌మ‌యం చూసి మొదలు పెట్టాలి. ఆ ప‌ని ఏ స్వభావానికి సంబంధించిందో చూసుకొని దానికి త‌గిన‌ట్లుగా ఈ స‌మ‌యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే దానికి త‌గిన ఫ‌లితాలుక‌నిపిస్తాయి. అదే విధంగా ముహుర్త స‌మ‌యంలో చేయాల్సిన క్రియ‌లు కూడా ముఖ్యమే. ఇటువంటి స‌మ‌యంలో జ‌రిగే అప‌శృతులు త‌ర్వాత కాలంలో ఇబ్బందుల‌కు కార‌ణం అవుతాయ‌న్నది కొంద‌రి న‌మ్మిక‌. ఆ విష‌యాన్ని ప‌క్కన పెడితే ప్రస్తుతం క‌మ‌ల్ జాత‌కంలో కూడా ఇబ్బందులు గోచ‌రిస్తున్నాయి. అందుకే మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతున్నార‌న్నది జ్యోతిషుల అభిప్రాయం. ఎటువంటి ప‌రిస్థితుల్లో అయినా మాన‌సిక ఒత్తిడి కి గురైతే పొర‌పాట్లు దొర్లిపోతాయి. అందుకే తీవ్ర ఎగుడు దిగుళ్లు చూసిన క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు బ‌హిరంగంగా ఆవేద‌న చెందాల్సి వ‌చ్చిందని చెబుతారు. ఏది ఏమైనా ఒక క‌ళాకారుని ఆవేద‌న వెనుక ఆర్ద్రత ముఖ్యం అన్నది గుర్తుంచుకోవాలి.

రాజ‌కీయాల్ని జ్యోతిషంతో ప‌రిశీలించ వ‌చ్చా..! ఎన్నిక‌ల ఫ‌లితాలు, తెలంగాణ సాధ‌న ను జ్యోతిషులు చెప్పగ‌లుగుతారా..!

రాజ‌కీయం అన్నది ప్రస్తుత స‌మాజంలో అంద‌రితోముడిప‌డిన అంశం. రాజకీయాలు లేకుండా ఆధునిక స‌మాజాన్ని చూడ‌టం సాధ్యం కాదు. అంద‌రి జీవితాల‌తో ముడి ప‌డి ఉన్న అంశంగా రాజ‌కీయాల్ని చెప్పవ‌చ్చు. ప్రజాస్వామ్యంలో ప‌రిపాల‌న పూర్తిగా రాజ‌కీయ పార్టీల చేతుల్లో ఉంటాయి. అందుచేత రాజ‌కీయ పార్టీలు ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా ప్రజ‌ల్ని ప్రభావితం చేస్తుంటాయి.

 అయితే రాజ‌కీయ పార్టీల‌ను జ్యోతిషంతో ప‌రిశీలించేందుకు ఒక ప‌ద్దతిని అనుస‌రిస్తుంటారు. వ్యక్తుల జాత‌కాన్ని చూసేందుకు ఏ విధంగా అయితే పుట్టిన తేదీ, స‌మ‌యం, పుట్టిన స్థలం చూసి జాత‌క చ‌క్రం గ‌ణించి ఫ‌లితాల్ని అంచ‌నా వేస్తుంటారు. అదే మార్గంలో ఒక రాజ‌కీయ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది ఆ స‌మ‌యంలో ఉన్న గ్రహ దృష్టి ఎలా ఉన్నది గ‌ణించి పార్టీల‌కు జాత‌క చక్రం గ‌ణిస్తారు. పార్టీల జాత‌క చ‌క్రంతో పాటు ఆ పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న వారి జాత‌క చ‌క్రం, పార్టీల ప్రధాన కార్యాల‌యాల వాస్తుని క‌లుపుకొని పార్టీల ఫ‌లితాల్ని అంచ‌నా వేస్తుంటారు. దీని ఆధారంగానే ఆ పార్టీ పాల్గొనే ఎన్నిక‌ల ఫ‌లితాలు, ఉద్యమాల ప్రభావం వంటివి విశ్లేషించి చెబుతారు.

జ్యోతిషం ఒక శాస్త్రమా.. ఒక న‌మ్మక‌మా.. ఒక వేదాంత‌మా..!

జ్యోతిషం మీద వివాదాలు కొత్తేమీ కాదు. దీనిపై ఉన్న విమ‌ర్శలు అన్నీ ఇన్నీ కావు. అస‌లు ఇదంతా ఒక వేస్ట్ అనుకొనే వారికి జ‌వాబు చెప్పటం కూడా వేస్ట్. ఎందుకంటే ఒక న‌మ్మకం బ‌లంగా మ‌న‌స్సులో పెట్టుకొని వాద‌న‌కు దిగుతుంటే ఆ వాద‌న ఎప్పటికీ తెగేది కాదు. అందుచేత జిజ్ఞాస ప‌రుల‌కు జ్యోతిషం అంటే ఏమిటో వివ‌రించ‌టం ఉత్తమం.
జ్యోతిషం అన్న ప‌దం సంస్కృత భాష లోది. జ్యోతి అంటే ఒక దీపం లేక వెలుగు అని అర్థం . అంటే స‌క‌ల మాన‌వాళికి, జీవ కోటికి జ్యోతి వంటి వెలుగులు ప్రసాదించే శాస్త్రం గా జ్యోతిషం ను భావించాల్సి ఉంటుంది. ఇది వేద‌ముల నుంచి ఉద్భవించిన అద్బుత శాస్త్రం. అందుకే ప్రాచీన భార‌తీయ జ్యోతిష శాస్త్ర వేత్తలు ఖండాంత‌రాల్ని దాటిన ఖ్యాతిని ఆర్జించారు.

జీవుల పుట్టుక‌, ఎదుగుద‌ల‌, వృత్తి ప‌ర‌మైన జీవితం, వ్యక్తిగ‌త జీవితం, మాన‌సిక ప‌రిప‌క్వత‌.. ఇలా ఒక‌టేమిటి జీవుడు పుట్టిన నాటి నుంచి గిట్టే వర‌కు ప్రతీ ద‌శ‌ను జ్యోతిషం ద్వారా విశ్లేషించుకోవ‌చ్చు. జ్యోతిషం సాయంతో మాన‌వ జీవితం ఫ‌లవంతం అవుతుంది. ప్రతీ ద‌శ‌లోని జ్ఞాన జ్యోతిలా ప్రకాశిస్తూ భ‌విష్యత్ ద‌ర్శనం చేస్తుంది.
జ్యోతిషం ద్వారా గ్రహ‌గ‌తుల్ని మార్చటం సాధ్యం కాదు సుమా. గ్రహాల ప్రభావం, ఫ‌లితాలు తెలుసుకొనేందుకు వీలవుతుంది. అందుకు అనుగుణంగా జీవ‌న గ‌మ‌నాన్ని స‌రిచేసుకొనే వీలు క‌లుగుతుంది. అంతిమంగా ధ‌ర్మ ప‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డిపేందుకు వీల‌వుతుంది. ఇదంతా జ్యోతిషం గురించి ప‌రిచ‌యం మాత్రమే సుమా..! జ్యోతిష శాస్త్రపు అద్భుత విశ్లేష‌ణ‌, వివ‌ర‌ణ త‌దుప‌రి పోస్టుల్లో చూడ‌వ‌చ్చు.

జ్యోతిషం ప్రాశ‌స్త్యం..!

వేదాలు ప్రసాదించిన అద్భుత శాస్త్రముల‌లో జ్యోతిష శాస్త్రం ఒక‌టి. అందుకే దీన్ని జ్యోతిర్వేదం అని కూడా అంటారు. ప్రాచీన భార‌తీయ విజ్ఞాన‌ముల‌లో ఇది అగ్రగ‌ణ్యమైన‌ది. ఈ విజ్ఞానాన్ని రుషి ప‌రంపర నుంచి తాళ‌ప‌త్ర గ్రంధాల‌లోకి అక్కడ నుంచి సంస్కృత వాజ్ఞయంలోకి ప్రవ‌హించింది. దీని నుంచి మ‌న ప్రాచీనులు ఎంతో శ్రమ‌కోర్చి ఇప్పటి త‌రానికి అందిస్తూ వ‌చ్చారు. ఈ అద్భుత విజ్ఞానంపై ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. విదేశీయులు సైతం ఆస‌క్తిగా దీన్ని అభ్యసిస్తున్నారు.

 ఈ ప్రాచీన విజ్ఞానంలోని అద్భుత ఫ‌లితాల్ని ఎంద‌రో చ‌వి చూశారు. అప్పట్లో రాజుల కొలువులో ఆస్థాన మంత్రి, ఆస్థాన వైద్యుల తో పాటు ఆస్థాన జ్యోతిషులు కూడా ఉండేవార‌ట‌. వాతావ‌ర‌ణం, పంట‌లు, స్థితిగ‌తుల్ని అన్నింటినీ ఆ శాస్త్ర వేత్తలు అంచ‌నా వేసి చెప్పగ‌లిగే వార‌ట‌.  ప‌రాశ‌రుడు, వ‌రాహ మిహిరుడు వంటి మ‌హానుభావులు ఈ శాస్త్ర విజ్ఞానాన్ని లోతుగా మ‌ధించి స‌రళీకరించి అనేక గ్రంథాలు వెలువ‌రించారు. ఈ సాహిత్యంలో చాలా భాగం కాల‌గ‌మ‌నంలో క‌లిసి పోయింది. కొద్ది పాటి శాస్త్ర అంశాల్ని మాత్రం అందుకోగ‌లిగాం. ఈ విజ్ఞానానికే ఆధునిక ప‌రిస్థితుల్ని రంగ‌రించి మ‌న పెద్దలు అభివృద్ధి ప‌రుస్తూ వ‌చ్చారు. త‌ర్వాత కాలంలో దీని నుంచి అనేక శాఖ‌లు ఉద్భవిస్తూ వ‌చ్చాయి. వీటి వివ‌రాలు క్రమంగా చ‌ర్చిద్దాం...

స్వాగ‌తం..


వేదాల్లో నిక్షిప్తమైన జ్యోతిష‌, వైదిక‌, ధార్మిక శాస్త్రాల‌ను స‌ర‌ళంగా అంద‌రికీ అందించాల‌న్నదే మా ప్రయ‌త్నం. ఇందులో ఉండే అంశాలు సూచ‌న‌ల‌గానే ప‌రిశీలించ‌గ‌లరు. అంద‌రికీ అందుబాటులోకి శాస్త్ర విజ్ఞానాన్ని తెచ్చే క్రమంలో అమ్మ వారి ఆశీస్సులు అంద‌రికీ ఉండాల‌ని ఆశిస్తున్నాం..