వినాయక వ్రతం రెండు రోజుల్లో రానుంది. ఇప్పటికే వరుస శెలవులు ఉండటంతో ఏర్పాట్లకు సమయం చిక్కింది. ముఖ్యంగా వినాయక వ్రతంలో పత్రిపూజ విశిష్టమైనది. ఈ పత్రి పూజ లో 21 రకాల పత్రులు ఉపయోగిస్తారు. ఈ పత్రులను ఈ రెండు రోజుల్లో సేకరించుకొనేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. కానీ సంస్కృతంలో ఉండే ఈ పత్రుల పేర్లు మనకు తెలీదే అనుకోవచ్చు. కానీ ఈ పత్రుల పేర్లు తెలుసుకొంటే వీటిని సేకరించుకొనేందుకు వీలవుతుంది.

బృహతీ పత్రం అంటే వాకుడు ఆకు. ఇది రోడ్ల పక్క లో ఉండే గుబురుగా ఉండే చెట్లు. వాకుడు కాయలు కూడా పచ్చడి పెట్టుకొంటారు. ఈ పత్రాలు లేదా కాయలు శ్వాసకోశ వ్యాధులకు విరుగుడుగా పని చే్స్తాయి. మాచీ పత్రం అంటే దవనం. దవనం ఆకు సువాసన ఇస్తుంది. ఆరోగ్యకరమైన తేజస్సును సమకూర్చును. ఒత్తిడి ని తగ్గించేందుకు దవనం ఆకులు నమలటం ఉపయోగిస్తుంది. ఈ దవనం ఆకులు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. బిళ్వ పత్రం అంటే మారేడు ఆకులు. మారేడు ఆకు అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టం. పరమేశ్వరునికి బిళ్వ పత్రి తో పూజ చేస్తే ఎంతో శ్రేష్టం. అందుచేత బిళ్వ దళాలతో వినాయకుడ్ని పూజించినా అంతే మేలు. మారేడు కాయ కూడా రుచికరం, శుచికరం. మారేడు పత్రికి ఉండే వగరు తో విరేచనాల్ని అరికట్ట గలుగుతుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. దూర్వ యుగ్మం అంటే గరిక. గరిక అంటే నేరుగా వినాయకుడికి చాలా చాలా ఇష్టం. ఈ గరిక లో అత్యంత రోగ నిరోధక శక్తి ఉంటుంది. బదరీ పత్రం అంటే రేగు. రేగు పత్రాలు చర్మ వ్యాధుల్ని దూరం చేస్తాయి. తులసీ పత్రం అంటే అందరికీ తెలుసు. ప్రతీ ఇంట తులసి ఉండాలని పెద్దలు చెబుతారు. తులసి జలం తీసుకొంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తేజస్సు కలిగిస్తుంది. అపామర్ల అంటే ఉత్తరేణి. శ్వాస కోశ సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుంది. చూత పత్రి అంటే మామిడి. మామిడి కి పుల్ల దనం రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. దుర్వాసన లేకుండా చేస్తుంది. జాజిపత్రి అంటే అందరకీ తెలిసిందే. ఇది చర్మ రోగాల్ని నియంత్రిస్తుంది. గండక అంటే అడవి మొల్ల, అశ్వథ పత్రం అంటే రావి, అర్జున పత్రం అంటే మద్ది, అర్క పత్రం అంటే జిల్లేడు, విష్ణు క్రాంత అంటే పొద్దు తిరుగుడు, దాడిమి అంటే దానిమ్మ, సింధువాకం అంటే వావిలాకు, కలవీర అంటే గన్నేరు అని అర్థం.
కాస్తంత ఓపిక చేసుకొంటే ఈ పత్రాల్ని సేకరించుకొనేందుకు వీలు కలుగుతుంది. ఈ పత్రాల్ని తెచ్చుకొంటే వినాయక స్వామికి ఎంతో ఇష్టం గా పూజ చేసుకోవచ్చు.