astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

మాఘ మాసం ఎప్పుడోస్తుందో..!

మాఘ మాసం ఎప్పుడు వ‌స్తుందో అని ఎదురు చూడాల్సిన ప‌ని లేదు. ఇప్పటికే మాఘ మాసం వ‌చ్చేసింది. ప్రతీ మాసానికి ఒక విశిష్టత ఉన్నట్లే ఈ మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివ కేశ‌వులు ఇద్దరికీ ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది. అంతే కాకుండా పితృ దేవ‌త‌ల ఆరాధ‌న‌కు కూడా త‌గిన రోజుగా చెప్పవ‌చ్చు. ఈ మాసంలో స్నాన‌ము ప్రత్యేకంగా చెప్పద‌గిన‌ది. ఎందుకంటే ఈ మాసం సూర్య భగ‌వానుడికి ఎంతో ఇష్టమైన‌ది అందుచేత ఈ మాసంలో ప్రాతః కాలంలో విధి విధానంగా స్నానం చేస్తే పుణ్యలోక ప్రాప్తి క‌లుగుతుంది.  సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపములనూ పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలములో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహమునందు స్నానమాచరించిన వారు పితృ , మాతృ వంశములకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి , పిదప అమర దేహుడై స్వర్గమునకు వెళతాడు. అరుణోదయము కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు. సూర్యోద‌య‌మున‌కు ముందే స్నానం చేస్తే ఉత్తమం. సూర్యోద‌య స‌మ‌యంలో స్నానం మ‌ద్యమం. సూర్యోద‌యం త‌ర్వాత స్నానం చేస్తే త‌క్కువ ఫ‌లితం ఉంటుంది. మిగిలిన రోజుల‌తో పోలిస్తే పౌర్ణమికి ముందు మూడు రోజులు మ‌రింత ప్రాశ‌స్త్యం అనుకోవ‌చ్చు. శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు దానం చేయాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.

    నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి. దీన్ని మాఘ వ్రతం అంటారు. పురాణముల‌ ప్రకారము , బ్రహ్మచారి , గృహస్థు, వానప్రస్థుడు , భిక్షకుడు , బాలురు , వృద్ధులు, యువకులు , స్త్రీలు , నపుంసకులు  అందరూకూడా మాఘమాసమందు శుభమైన తీర్థమందు స్నానం చేసి, కోరిన ఫలమును పొందుతారు. అవయవములు దృఢం గా ఉన్నవారు చన్నీటి తోను , లేనివారు వేడి నీటి తోను స్నానం చెయ్యవచ్చు. పుష్య పౌర్ణమి గడిచాక మాఘ పౌర్ణమి వచ్చే వరకు విష్ణుపూజ విధిగా చేయాలి.
ఈ మాసంలో సూర్యారాధ‌న చెప్పద‌గిన‌ది. ముందే చెప్పినట్లుగా ఈ మాసం ఆయ‌న‌కు ఎంతో ఇష్టమైన‌ది. ముఖ్యంగా ఆదివారం నాడు సూర్య భ‌గ‌వానుడ్ని త‌ప్పక అర్చించాలి. ఆ రోజున సూర్యుని వైపు తిరిగి పూజ చేసుకొంటారు. సంక‌ల్పం చేసుకొని చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయ‌లు సేక‌రించి ర‌థం చేస్తారు. దీనిపై సూర్య భ‌గ‌వానుడ్ని లోహ రూపంలో ఆవాహ‌న చేసుకొంటారు. సూర్యుడ్ని షోడ‌శ ఉప‌చార‌ముల‌తో పూజించి పాయ‌సం లేక పొంగ‌లి త‌యారుచేసి నివేద‌న చేస్తారు. పాలు పొంగిన‌ట్లు సౌభాగ్యం పొంగాల‌ని వేడుకొంటారు. ఇది ఎప్పటినుంచో ఉన్న ఆన‌వాయితీ.
ఇక ఈ మాసంలో వ‌చ్చే విశిష్ట పండుగ ర‌థ స‌ప్తమి. దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి  అని అంటారు.       ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేస్తే , షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి , సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి.  నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి  భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి.      సూర్యుణ్ణి   ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనం తో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వివస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి.
మాఘ మాసంలో మంచి ఆలోచ‌న‌ల‌తో చ‌క్కటి ఆరాధ‌న‌లు చేసుకొని మాఘ మాస ప్రత్యేక‌త‌ను చాటుదాం.. శుభ‌మ‌స్తు..!

No comments:

Post a Comment