astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

శివ‌రాత్రి రోజు త‌ప్పని స‌రిగా చేయాల్సిన‌వి..!

ఆది వారం రోజు మ‌హా శివ‌రాత్రి. అంటే సాక్షాత్తు ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజే ప‌ర‌మేశ్వరుడు మ‌హా లింగ రూపంలో ఆవిర్భవించాడ‌ని చెబుతారు. అంత‌టి విశిష్టమైన రోజున ఆచ‌రించాల్సిన విధి విధానాల్ని నిగ‌మ శాస్త్రములు వివ‌రిస్తున్నాయి. ఆగ‌మం అంటే దైవిక క్రియ‌లు అని అర్థం. నిగ‌మ శాస్త్రములు అంటే మాన‌వుడు ఆచ‌రించాల్సిన విధులు అని అర్థం.

మ‌హా శివ‌రాత్రి వేకువ జామునే నిద్ర లేవటం ఉత్తమం. మాఘ మాసంలో సూర్యోద‌యానికి ముందే స్నానం ఆచరించాలి. మిగిలిన రోజుల్లో వీలు కుదిరినా, కుద‌ర‌క పోయినా క‌నీసం శివ‌రాత్రి అయినా వేకువ జామునే నిద్ర లేచి స్నానం ఆచ‌రిస్తే మేలు. సూర్యోద‌యానికి ముందు రెండు గంట‌ల పాటు బ్రాహ్మీ ముహుర్తం అని చెబుతారు. (సుమారుగా) ఈ స‌మ‌యంలో దేవ‌త‌ల‌కు ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది. అందుచేత ఈ స‌మ‌యంలో స్నానాదికాలు పూర్తి చేసి ఇష్ట్ దేవ‌త‌ల్ని పూజించాలి.ఈ రోజున ప‌ర‌మేశ్వరుడ్ని బిళ్వ ద‌ళాల‌తో అర్చిస్తే ఎంతో మంచిది. విభిన్న ద్రవ్యముల‌తో అభిషేకం చేయిస్తే ఎంతో మంచిది. శివుడు అభిషేక ప్రియుడు అని అంద‌ర‌కి తెలిసిన‌దే. అందుచేత ప‌ర‌మేశ్వరుడ్ని వివిధ ర‌కాల ద్రవ్యముల‌తో అభిషేకం, అర్చన చేయిస్తే ఉత్త మ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విభూదితో అభిషేకం చెప్పుకోద‌గిన‌ది.
ఈ రోజున ఉప‌వాసం చేయ‌టం ఆన‌వాయితీ. చాలామంది రోజంతా అంటే మ‌ర్నాడు సూర్యోద‌యం దాకా ఉప‌వాసం ఉంటారు. లేని ప‌క్షంలో రెండు ర‌కాలుగా ఉప‌వాసం చేస్తారు. అంటే ప‌గ‌లంతా ఉప‌వాసం ఉండి, రాత్రి న‌క్షత్ర ద‌ర్శనం త‌ర్వాత భుజిస్తారు. దీన్ని న‌క్తం అని పిలుస్తారు. లేదంటే ప‌గ‌టి పూట ఆహారం తీసుకొని రాత్రంతా ఉప‌వాసం ఉంటారు. దీన్ని ఏక‌భుక్తం అంటారు. ఇందులో ఏ విధానం మేలు అన్నది ఎవ‌రికి వారు ఆలోచించుకోవాలి. మొత్తం ఉప‌వాసం ఉండ‌టం శ్రేయోదాయకం. పూర్తిగా ఆహారానికి దూరంగా ఉంటే ఆరోగ్య స‌మ‌స్యలు వ‌చ్చే చాన్సు ఉన్నందున ద్రవాహారం లేదా ప్రసాదం లేదా పండ్లతో న‌డిపించ‌వ‌చ్చు.
ఇక‌, శివ‌రాత్రి ప్రాశ‌స్త్యం అంతా రాత్రి స‌మ‌యంలోనే ఉంటుంది. ఈ రాత్రి భ‌జ‌న‌లు, పారాయ‌ణాల‌తో జాగారం  చేస్తే ఎంతోమేలు. స‌దా శివ‌న్నామ స్మర‌ణ చేయ‌టం ఉత్తమం. అర్థ రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం, అర్చన‌లు చేయించాలి. ఇది ఎంతో విలువైన స‌మ‌యం కాబ‌ట్టి ప‌ర‌మేశ్వరుడ్ని పూజించి ఆయ‌న కృప‌కు పాత్రుల‌వ‌దాం...

No comments:

Post a Comment