astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

రేప‌టి ప్రాధాన్యం మీకు తెలుసా..!

రేప‌టి శుక్రవారం ఫాల్గుణ శుద్ధ చ‌తుర్థి. ఈ రోజున పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం ఆచ‌రిస్తారు. పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతానికి చాలా ప్రాధాన్యం ఉంది.

క‌లౌ చండీ గ‌ణేశా .. అని చెబుతారు. అంటే క‌లికాలంలో కోరిన కోర్కెలు తీర్చే దేవ‌త‌లుగా వినాయ‌కుడు, దుర్గా దేవి ప్రసిద్ది కెక్కారు.అంటే భ‌క్తి శ్రద్ధ ల‌తో గ‌ణేశుడ్ని అర్చిస్తే కోర్కెలు నెర‌వేరుతాయ‌న్నది న‌మ్మిక‌. త‌ల‌నొప్పి కి మందు వాడితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. జ్వరానికి మాత్ర వేసుకొంటే జ్వరం త‌గ్గుతుంది. అన్ని మాత్రలే అయినా అందులో ఉండే కెమిక‌ల్ కాంపొనెంట్ వేరుగా ఉంటుంది కాబ‌ట్టి ఫ‌లితం వేరుగా ఉంటుంది. అలాగే గ‌ణేశుడికి పూజ‌లు అంతా చేస్తారు. కానీ సంతానం కావాల‌ని కోరుకొనే వారు మాత్రం పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం చేయ‌టం మంచిది. పుత్ర గ‌ణ‌ప‌తిని ధ్యానించుకొని సంక‌ల్పం చేయాలి. స్వామికి పురుష సూక్త విధానంతో కానీ, శ్లోక విధానంలో కానీ షోడశ ఉప‌చారాలు చెబుతూ పూజించాలి. స్వామికి ఇష్టమైన నివేద‌న‌లు చెల్లించ‌టం, గ‌రిక ప‌త్రి తో అష్టోత్తరం లేక స‌హ‌స్రం చేయించ‌టం మంచిది. కొంత‌మంది ఈ వ్రతం రోజున ఉప‌వాసం ఆచ‌రిస్తారు. అంటే ఉద‌యం నుంచి సాయంత్రం దాకా ఆహారం తీసుకోకుండా గ‌డుపుతారు. భ‌క్తి తో పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం చేస్తే సంతానం క‌లుగుతుంద‌న్నది భ‌క్తుల నమ్మిక‌.

3 comments:

  1. సవరణ చేస్తున్నందుకు మన్నించాలి.
    రేప‌టి ప్రాధాన్యం మీకు తెలుసా అని శీర్షిక పెట్టారు. ఇందులో ప్రాధాన్యత అని సరిజేయాలి.
    అన్యధా భావించవద్దు.

    ReplyDelete
    Replies
    1. పెద్ద మ‌న‌స్సుతో మీరు చెప్పిన స‌వ‌ర‌ణ ను గౌర‌విస్తున్నాం.. అయితే తెలుగు ప‌త్రికా భాష ప్రామాణికాల ప్రకారం ప్రాధాన్యం అనే ప‌ద‌మే వాడుతున్నారు. భాష రీత్యా మీరు చెప్పినట్లుగా ప్రాధాన్యత అని వాడ‌వ‌చ్చు. కానీ పత్రికా ర‌చ‌న నే ప్రామాణికంగా తీసుకొని బ్లాగ్ లో రాస్తున్నందున ఇలా రాయాల్సి వ‌చ్చింద‌ని గ‌మనించ‌గ‌ల‌రు. నిండు మ‌న‌స్సుతో ఈ వివ‌ర‌ణ ను అంగీక‌రిస్తార‌ని భావిస్తున్నాం..న‌మ‌స్సుల‌తో

      Delete
    2. సంతోషం.
      కాని నేటి కాలంలో పత్రికలలో తెలుగు భాష చాలా భ్రష్టుపట్టి పోయిందని తమకు తెలుసునని భావిస్తున్నాను.
      పత్రికలలో భాష దిగజారుతున్నప్పూడు మనం ఆ దిగజారటాన్ని ప్రామాణీకరించనక్కరలేదని విజ్ఞులైన తమకు నా మనవి. పత్రికలే అని కాదు మొత్తం మీడియాపరంగా తెలుగుభాషావినియోగం చాలా విచారకరంగా ఉంది. మీడియాలో భాష దిగజారటానికి కారణం అందులో పనిచేసే వారికి తెలుగుపట్ల సరయిన అవగాహన అభినివేశమూ‌ శ్రథ్థా లేకపోవటమే.

      కనీసం మనం అయినా భాషను సరిగా వినియోగించటం ద్వారా కొంతలో కొంత తప్పును సరిజేయటానికి ప్రయత్నిస్తే బాగుంటు దనుకుంటున్నాను. ఆపైన తమ చిత్తం.

      Delete